Begin typing your search above and press return to search.

కోడికత్తి కేసులో కొత్త ట్విస్ట్... ఎన్.ఐ.ఏ కోర్టు కీలక నిర్ణయం!

ఈ కేసు ను విశాఖపట్నం ఎన్.ఐ.ఏ. కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు విజయవాడ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   1 Aug 2023 11:32 AM GMT
కోడికత్తి కేసులో కొత్త ట్విస్ట్... ఎన్.ఐ.ఏ  కోర్టు  కీలక  నిర్ణయం!
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. 2018 అక్టోబరు 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్‌ పోర్ట్‌ లో జగన్ పై శ్రీనివాస్‌ రావు అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. అయితే ఈ కేసు కు సంబంధించి తాజాగా విజయవాడ ఎన్.ఐ.ఏ కోర్టు కీలక విషయాలు వెల్లడించింది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై గత ఎన్నికల సమయంలో జరిగిన కోడి కత్తి దాడి విచారణ పై విజయవాడ ఎన్.ఐ.ఏ. కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ కేసు కు సంబంధించిన విచారణ జరిపిన న్యాయస్థానం అనంతరం... ఈ కేసు ను విశాఖపట్నం ఎన్.ఐ.ఏ. కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు విజయవాడ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

అవును... తాజాగా ఈ కేసు పై ఇవాళ విచారణ జరిపిన విజయవాడ కోర్టు.. విశాఖపట్నం ఎన్.ఐ.ఏ. కోర్టుకు బదిలీచేసింది. తదుపరి విచారణ ను ఆగస్ట్ 8కి వాయిదా వేసింది. దీంతో ఇకనుంచి తదుపరి విచారణ మొత్తం ఇక విశాఖ ఎన్.ఐ.ఏ. కోర్టులోనే కొనసాగనుంది. అయితే... ఈ విషయం పై నిందితుడి తరుపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

విజయవాడ కోర్టు నిర్ణయం పై నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది గగన సింధు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. 80 శాతం వాదనలు పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమని అన్నారు. అయితే ఎక్కడైనా తమ వాదనలు పూర్తిస్థాయి లో వినిపిస్తామని తెలిపారు.

కాగా... 2018 అక్టోబరు 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయం లో అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ పై శ్రీనివాస్‌ రావు అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్ జగన్ చేతికి గాయమై హాస్పిటల్లో చేరారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసు ను రాష్ట్ర పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది.

కానీ రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థలపై తనకు నమ్మకం లేదంటూ.. జగన్ మోహన్ రెడ్డి తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి నిరాకరించారు. అనంతరం వైసీపీ... రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించి, ఈ కేసు పై కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరింది.

దీంతో... కోర్టు ఆదేశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ 31వ తేదీన ఈ కేసు ను ఎన్.ఐ.ఏ. కు అప్పగించింది. జనవరి 1, 2019న ఎన్.ఐ.ఏ. కేసు నమోదు చేసింది. నాటినుంచి ఈ కోడి కత్తి కేసు విచారణ విజయవాడ ఎన్.ఐ.ఏ. కోర్టులో కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా విజయవాడ నుంచి విశాఖ ఎన్.ఐ.ఏ. కోర్టుకు బదిలీ అయ్యింది!