Begin typing your search above and press return to search.

కోడికత్తి శ్రీను విషయం లో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది!

ఆ సంగతి అలా ఉంటే... ఇంతకాలం పాటు కోడికత్తి శ్రీను జైల్లో మానసికంగా ఎంతో ఆవేదన చెంది ఉంటాడు.

By:  Tupaki Desk   |   10 Feb 2024 6:02 AM GMT
కోడికత్తి శ్రీను విషయం లో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది!
X

2018 అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో హత్యాయత్నం చేశారనే కేసుపై నాటి నుంచి విశాఖ సెంట్రల్ జైలులో మగ్గిపోయిన జనిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను)కు ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. హత్యాయత్నం కేసులో ఒక నిందితుడు ఇంతకాలం బెయిల్ రాకుండా జైల్లో ఉండటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు కోడికత్తి శ్రీను బెయిల్ పై విడుదలవ్వడం అనేది రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. ఎన్నికల సమయం కావడంతో ఆ కేసులో ఇతడి వెర్షన్ వినాలని.. ఫలితంగా జగన్ పై విరుచుకుపడాలని విపక్షాలు ప్రయత్నించే అవకాశం లేకపోలేదు! అయితే... బెయిల్ సమయంలో కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది. ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు అనేది ఆ కండిషన్స్ లో ఒకటి! దీంతో... కోడికత్తి ఇంటర్వ్యూల కోసం ఎదురుచూసినవారికి ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఆ సంగతి అలా ఉంటే... ఇంతకాలం పాటు కోడికత్తి శ్రీను జైల్లో మానసికంగా ఎంతో ఆవేదన చెంది ఉంటాడు. తీవ్ర మానసిక క్షోభకు గురై ఉంటాడు. పైగా ఎంతో సీరియస్ కేసు.. రాజకీయంగా మరింత చర్చనీయాంశం అయిన కేసు. అలాంటి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎంతో కొంత అర్ధం చేసుకోవడానికి వీలయ్యే అంశమే! అయితే... ఈ సమయంలో చదువుపై దృష్టి పెట్టాడు శ్రీను!

అవును... ఒక సీరియస్ కేసులో విచారణ ఖైదీగా ఉంటూ ఎంతో మానసిక ఒత్తిడి అనుభవిస్తూ కూడా బీఏ డిగ్రీ చదువు పూర్తిచేశాడు శ్రీను. ఇందులో భాగంగా... రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగానే ఆ కార్యక్రమం పూర్తి చేశాడట. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ విధానంలో శీను జైల్లో ఉండగా బీఏ జాయిన్ అయి.. ఏకంగా 70 శాతం మార్కులతో పూర్తి డిగ్రీ పూర్తిచేశాడని తెలుస్తుంది. దీంతో... ఈ విషయం తెలిసినవారంతా ఆన్ లైన్ వేదికగా శ్రీనుకి అభినందనలు తెలియజేస్తున్నారని తెలుస్తుంది.

కాగా... 2018 అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్ పోర్ట్ లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌ పై.. అక్కడే రెస్టారెంట్ లో పని చేస్తున్న శ్రీను.. కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే! దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు! అనంతరం... ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఎన్‌.ఐ.ఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు శ్రీను. అయితే ఈ బెయిల్ పిటిషన్ ను ఎన్.ఐ.ఏ. న్యాయస్థానం నిరాకరించింది.

దీంతో శ్రీను బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యలో ఈ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో... జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం వల్ల నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని.. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. తాజాగా శ్రీనివాస్‌ కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.