కోడెల శివరాంకు ఎప్పుడూ ఊరడింపు మాటలతోనే సరా..?
ఎన్నికలకు ముందు పార్టీ మారి వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సీటు ఇచ్చి శివరాంకు ఊరడింపు మాటలతో సరిపెట్టారు.
By: Tupaki Desk | 18 May 2025 7:00 AM ISTమాజీ మంత్రి.. మాజీ స్పీకర్.. తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత నేత కోడెల శివరాంకు ఆ పార్టీలో ఫ్యూచర్ ఉందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. గత రెండు దశాబ్దాలుగా కోడెల కుటుంబం ఇటు తెలుగుదేశం పార్టీలోనూ, అటు రాజకీయంగా పట్టు సాధించేందుకు ఆపసోపాలు పడుతోంది. గత రెండున్నర దశాబ్దాలలో కోడెల ఫ్యామిలీకి 2014లో సత్తెనపల్లిలో గెలుపు ఒక్కటి మాత్రమే అతిపెద్ద విజయం. అది కూడా నవ్యాంధ్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో కోడెల కేవలం 700 ఓట్ల స్వల్ప తేడాతో ఎమ్మెల్యేగా గట్టెక్కారు. చంద్రబాబు ఆయన సీనియార్టీని గౌరవిస్తూ స్పీకర్ పదవి ఇచ్చారు. ఐదేళ్లలోనే కోడెలకు సత్తెనపల్లి నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మరీ ముఖ్యంగా ఆయన కుమారుడు, కుమార్తె తీరుపై సొంత పార్టీ కేడర్‌లోనూ, ఇటు నియోజకవర్గ ప్రజల్లోనూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఫలితంగా 2019 ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లిలో ఘోరంగా ఓడిపోయారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత ఘోర అవమానాలు.. అనేక కారణాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత కోడెల వారసుడికి మాత్రం సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్జ్ పగ్గాలు చంద్రబాబు ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు పార్టీ మారి వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సీటు ఇచ్చి శివరాంకు ఊరడింపు మాటలతో సరిపెట్టారు. శివరాం అరిచి గీ పెట్టినా ఆయన గోడు చంద్రబాబు పట్టించుకోలేదు సరికదా.. పార్టీ అధికారంలోకి వస్తే పదవి ఇస్తా అని ఊరడించారు. కట్ చేస్తే గత యేడాది ఎన్నికల్లో కూటమి అప్రతిహత విజయం సాధించడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
యేడాది కాలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంతో మంది నేతలకు పదవులు వస్తున్నాయి. పార్టీల కోసం త్యాగం చేసిన వారికి కూడా చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలో కీలక పదవులు వస్తున్నాయి. శివరాంను మాత్రం పట్టించుకోవడం లేదు. శివరాంకు చిన్న నామినేటెడ్ పదవి కూడా దక్కే పరిస్థితి ఇప్పుడు పార్టీలో లేదు. ఇటీవలే ఉమ్మడి గుంటూరు జిల్లాకే చెందిన ఆలపాటి రాజాకు ఎమ్మెల్సీ, రాయపాటి అరుణ, ఆలపాటి సురేష్‌కు నామినేటెడ్ పదవులు దక్కాయి.
వీరు ముగ్గురు కమ్మ వర్గం వారే. ఇప్పటికే జిల్లా నుంచి స్టేట్, సెంట్రల్ మంత్రులు కూడా కమ్మ వర్గం వారే ఉన్నారు. ఏకంగా 8 మంది కమ్మ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇంత టఫ్ కాంపిటేషన్‌లో శివరాం వైపు బాబు, లోకేష్ చూస్తారా ? అంటే డౌటే. ఇటు సత్తెనపల్లిలో కన్నా ఫ్యామిలీ, అటు నరసారావుపేటలో చదలవాడ అరవిందబాబు పాగా వేసేశారు. ఈ టైంలో శివరాంకు ఇటు పొలిటికల్ గ్రౌండూ లేదు.. అటు నామినేటెడ్ ఊసూ లేదు అన్నట్టుగా రాజకీయం మారిపోయింది. ఏదేమైనా శివరాంకు పార్టీ అధికారంలో ఉన్నా పొలిటికల్ ఫ్యూచర్ అయితే కనపడట్లేదు.
