సన్ ఆఫ్ కోడెల...ఈసారి ఎలాగైనా !
అయితే రెండేళ్ళ పాలన టీడీపీ కూటమి పూర్తి చేసుకుంటోంది. నామినేటెడ్ పదవి కూడా శివరాం కి దక్కలేదని ఆయన వర్గం కలవరపడుతోంది.
By: Satya P | 28 April 2026 9:39 AM ISTగుంటూరు జిల్లా రాజకీయాల్లో హస్తవాసి ఉన్న మంచి డాక్టర్ గా కోడెల శివప్రసాదరావుకు మంచి పేరు ఉంది. అలాంటి ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టాక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అలా దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు పల్నాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా శాసించారు. అంతా తానై పాలించారు. ఎందరో నాయకులను తయారు చేశారు. పార్టీకి అండగా నిలిచారు. అగ్ర నేతలలో ఒకరిగా చలామణీ అయ్యారు. ఎన్నో సార్లు మంత్రిగా పనిచేసి హోం వంటి కీలక శాఖలను చూసిన కోడెల శివప్రసాదరావుకు విభజన ఏపీలో స్పీకర్ పదవి దక్కింది. మంత్రి కావాలనుకున్న ఆశలకు అలా చెక్ పడింది. 2019లో ఆయన ఓటమి చెందాక కేవలం నాలుగు నెలల తేడాలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆయన రాజకీయ జీవితం వ్యక్తిగత జీవితం ఒక్కసారిగా ముగిసినట్లు అయింది.
వారసుడిగా ఎంట్రీ :
కోడెలకు రాజకీయ వారసుడిగా కుమారుడు శివరాం ఉన్నారు. ఆయన తండ్రి ఉన్నపుడే రాజకీయంగా మెల్లగా తన ప్రభావం చూపిస్తూ వచ్చారు. ఇక కోడెల హఠాన్మరణం తరువాత సహజంగానే వారసుడిగా శివరాం కి చాన్స్ ఉంటుందని అనుకున్నారు. దానికి తోడు చంద్రబాబు శివరాం బాధ్యతను తాను చూసుకుంటాను అని అప్పట్లో హామీ ఇచ్చారని ప్రచారం సాగింది. అయితే 2024 ఎన్నికల్లో పోటీకి శివరాం ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. రాజకీయ సామాజిక ఈక్వేషన్స్ అన్నీ చూసుకుని మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణని బీజేపీలో నుంచి తెచ్చి సత్తెనపల్లి టికెట్ ని ఆయనకు టీడీపీ అధినాయకత్వం ఇచ్చింది. దాంతో శివరాం నిరాశకు గురి అయ్యారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక చూస్తామని హామీ దక్కింది.
ఎదురు చూపులేనా :
అయితే రెండేళ్ళ పాలన టీడీపీ కూటమి పూర్తి చేసుకుంటోంది. నామినేటెడ్ పదవి కూడా శివరాం కి దక్కలేదని ఆయన వర్గం కలవరపడుతోంది. అదే సమయంలో ఆయనకు నిన్నటిదాకా ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా తాజా కమిటీల ప్రకటనతో పోయింది. ఈ పరిణామంతో శివరాం వర్గం పూర్తిగా డీలా పడింది అని అంటున్నారు. ఇంకో వైపు సత్తెనపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. దాంతో కన్నా వర్గం మరింత దూకుడుగా సత్తెనపల్లిలో పాలిటిక్స్ చేస్తోంది.
పోటీకి రెడీ అంటూ :
అయితే తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ 2029లో పార్టీ టికెట్ ఇస్తుందని ఆశాభావంతో కోడెల శివరాం ఉన్నారని అంటున్నారు. ఆయన పోటీకి సిద్ధంగా ఉన్నారని కూడా చెబుతున్నారు. మరో వైపు చూస్తే అయితే సత్తెనపల్లి లేకపోతే నరసరావుపేట నియోజకవర్గాలలో ఏదో ఒక చోట నుంచి పోటీకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు అని టాక్. అయితే ఈ రెండు సీట్లలో బలమైన సిట్టింగులు ఉన్నారు. దాంతో కోడెల శివరాం ఆశలు ఏ మేరకు నెరవేరుతాయన్నది కూడా చర్చగా ఉంది. ఇదిలా ఉంటే ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో అక్రమ మైనింగ్ సాగుతోంది అని శివరాం ఇటీవల కలెక్టర్ ని కలసి ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. ప్రభుత్వానికి ఆదాయం గండి పడుతోంది అని అంటూ ఆయన చేసిన ఈ ఫిర్యాదు స్థానికంగా ఉన్న సొంత పార్టీలోని ప్రత్యర్థులు మీదనే అని అంటున్నారు. మరో వైపు తన బలాన్ని పెంచుకోవడం సొంత పార్టీలో ప్రత్యర్ధులను తగ్గించడం అన్న అజెండాతో సరికొత్త పాలిటిక్స్ కి జూనియర్ కోడెల తెర తీస్తున్నారు అని అంటున్నారు మరి హైకమాండ్ ఆయన ఫిర్యాదుల వెనక మర్మాన్ని ఆయన ఆలోచనల వెనక ఉన్న ఆశలను ఏ మేరకు పట్టించుకుంటుంది అన్నదే చర్చగా ఉంది.
