Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ పై అధి సాధ్యమయ్యే పనేనా?

కేసీఆర్‌ ను ఓడించడానికి అన్ని పార్టీలు కలవాలని.. అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆయనపై పోటీకి దిగాలని కోదండరాం సూచిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2023 8:16 AM GMT
కేసీఆర్‌ పై అధి సాధ్యమయ్యే పనేనా?
X

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా కేసీఆర్‌ ఈసారి ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ తోపాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డిలోనూ పోటీకి దిగుతున్నారు.

కేసీఆర్‌ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. కేసీఆర్‌ ఓటమి భయంతోనే గజ్వేల్‌ తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఇప్పటికే గజ్వేల్‌ లో కేసీఆర్‌ పై తాను పోటీ చేస్తానని బీజేపీ నేత, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ సవాల్‌ విసిరారు. ఇక కేసీఆర్‌ పై కామారెడ్డిలో తాను ప్రత్యర్థిగా బరిలోకి దిగుతానని మరో బీజేపీ నేత విజయశాంతి చాలెంజ్‌ చేశారు.

మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో తమను అన్ని విధాల వాడుకుని నట్టేట ముంచిన కేసీఆర్‌ పై రాజకీయంగా పగ తీర్చుకోవాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కసితో ఉన్నాయి. ఇలా అన్ని పార్టీలు కేసీఆర్‌ ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నాయి.

ఇప్పుడు ప్రొఫెసర్‌ కోదండరాం వంతు వచ్చింది. ఆయన ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. కేసీఆర్‌ ను ఓడించడానికి అన్ని పార్టీలు కలవాలని.. అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆయనపై పోటీకి దిగాలని కోదండరాం సూచిస్తున్నారు.

తెలంగాణ జేఏఈ సంఘాల అధ్యక్షుడిగా కోదండరాం రాష్ట్ర ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. ప్రజా సంఘాలను, ఉద్యోగ సంఘాలను అన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఆయన ముందుకు నడిపించారు. చివరకు కేసీఆర్‌ రాజకీయ పాచికలాటలో కోదండరాం కూడా నష్టపోయారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ను ఓడించడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోదండరాం పిలుపునిస్తున్నారు. అయితే ఇందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), ఇతర చిన్నా చితక పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉంది. కానీ మరో ప్రధాన పార్టీ బీజేపీ ఈ పార్టీలతో కలిసే అవకాశం లేదు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవనే నానుడి ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పై ఉమ్మడి అభ్యర్థిని నిలపాలంటే బీజేపీ, కాంగ్రెస్‌ ఇలా అన్ని పార్టీలు కలిసికట్టుగా ఉంటేనే ఈ ప్రతిపాదన సాధ్యమవుతుంది.

అలా కాకుండా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ కలిసికట్టుగా అభ్యర్థిగా నిలిపినా బీజేపీ అభ్యర్థి కూడా బరిలో ఉండే చాన్సు ఉంటుంది. అలాంటప్పుడు ముక్కోణపు పోరులో ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం ఉంటుంది. ఇది అంతిమంగా ఎవరికి మేలు చేస్తుందో తేల్చడం కష్టం. మరి కోదండరాం ఆశించినట్టు కేసీఆర్‌ పై ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాదన కల సాకారమవుతుందో, లేదో వేచిచూడాల్సిందే.