గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహర్.. జూబ్లీహిల్స్ టికెట్?
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మాజీ ప్రొఫెసర్ కోదండరాం, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజహరుద్దీన్ ను సిఫారసు చేస్తూ కేబినెట్ తీర్మానించింది.
By: Tupaki Desk | 30 Aug 2025 4:41 PM IST15 రోజుల్లో కోదండరాం సార్ ను మళ్లీ ఎమ్మెల్సీని చేస్తాం.. ఎవరు ఆపుతారో చూద్దాం అని మూడు రోజుల కిందట ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి తన హామీని నెరవేర్చారు. పనిలో పనిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఎవరికో కూడా హింట్ ఇచ్చేశారు.. శనివారం తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మాజీ ప్రొఫెసర్ కోదండరాం, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజహరుద్దీన్ ను సిఫారసు చేస్తూ కేబినెట్ తీర్మానించింది.
బీసీ రిజర్వేషన్ లిమిట్ ఎత్తివేత..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపైనా తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో రిజర్వేషన్ పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. అనంతరం బీసీలకు పంచాయతీల్లో రిజర్వేషన్ కల్పించనుంది. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిఫారసు చేసిన ఆమేర్ అలీ ఖాన్ స్థానంలో అజహర్ కు చోటిచ్చింది. కోదండరాం నియామకాన్ని కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆయనను మళ్లీ ఎమ్మెల్సీని చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అదే పని చేశారు.
జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్ కేనా?
ఎమ్మెల్సీగా సిఫారసు చేయడం ద్వారా అజహరుద్దీన్ ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ రేసు నుంచి తప్పించినట్లయింది. మరి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ టికెట్ ఎవరికి? అని ప్రశ్న వస్తోంది. దీనికి సమాధానంగా చెబుతున్న పేరు నవీన్ యాదవ్. నియోజవకర్గంలో బలమైన పట్టున్న, యువకుడైన నవీన్ యాదవ్ 2014లో ఎంఐఎం తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2018లో చివరి నిమిషంలో ఎంఐఎం టికెట్ రాలేదు. అయినా స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు. 2023 ఎన్నికల నాటికి కాంగ్రెస్ లో చేరారు. పోటీ చేయలేదు. ఇప్పుడు అనూహ్యంగా అవకాశం దక్కేలా ఉంది.
వాస్తవానికి యువకుడైన నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు, ప్రభావం చూపగల సత్తా ఉంది. కానీ, కొన్ని కారణాల రీత్యా ఆయనకు ప్రధాన పార్టీల్లో ఎంట్రీ లేకపోయింది. ఇప్పుడు మాత్రం టైమ్ కలిసివచ్చింది అనుకోవాలి. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్. గతంలో టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత వివిధ పార్టీలకు మద్దతు ప్రకటించారు. నవీన్ యాదవ్ రంగంలోకి వచ్చాక చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడికే పూర్తి బాధ్యతలు అప్పగించారు.
బీఆర్ఎస్ నుంచి టికెట్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికే ఇస్తారని భావిస్తున్నారు. లేదంటే మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని బరిలో దింపుతారేమో చూడాలి.
