Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌కు జై కొట్టిన కోదండ‌రాం: కేసీఆర్‌పై ఎఫెక్ట్ ఎంత‌?

తెలంగాణ మేధావుల ఫోరం మాజీ అధ్య‌క్షుడు, తెలంగాణ జ‌న స‌మితి(టీజేఎస్) పార్టీ అధ్య‌క్షుడు కోదండ రాం కాంగ్రెస్‌కు జై కొట్టారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 10:37 AM GMT
కాంగ్రెస్‌కు జై కొట్టిన కోదండ‌రాం:  కేసీఆర్‌పై ఎఫెక్ట్ ఎంత‌?
X

తెలంగాణ మేధావుల ఫోరం మాజీ అధ్య‌క్షుడు, తెలంగాణ జ‌న స‌మితి(టీజేఎస్) పార్టీ అధ్య‌క్షుడు కోదండ రాం కాంగ్రెస్‌కు జై కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు తెలిపారు. తాజాగా ఆయ‌న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో ఇరుప‌క్షాల మ‌ధ్య స‌యోధ్య కుదిరింది. దీంతో ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప్ర‌చారం చేసేందుకు, ఆ పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు కోదండ రాం ప‌చ్చ‌జెండా ఊపారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని కోరిన వెంట‌నే కోదండ‌రాం అంగీక‌రించార‌ని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళతామన్నారు. టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుందని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో కోదండ రాంను కేసీఆర్ అన్ని విధాలా వాడుకున్నార‌ని.. త‌ర్వాత ప‌క్క‌న పెట్టార‌ని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. అప్ప‌టి నుంచి ప్ర‌జ‌ల కోసం.. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై కోదండ‌రాం పోరాడుతున్నార‌ని చెప్పారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని, అందుకే ఆయ‌న‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు.

ఎన్నికల్లో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయ‌ని కోదండ రాం వెల్ల‌డించారు. రాష్ట్రంలో బీఆర్ ఎస్‌ను మ‌ట్టి క‌రిపించ‌డ‌మే ల‌క్ష్యంగా తాము కాంగ్రెస్‌తో క‌లిసి అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ప్రొఫెస‌ర్ కోదండ రాం చెప్పారు. ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌లోనే అన్నీ వివ‌రిస్తామ‌న్నారు. ప‌ద‌వులు, టికెట్లు ఆశించి.. తాము కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తివ్వ‌డం లేద‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. ఇదిలావుంటే.. కోదండ రాం రాక‌తో సీఎం కేసీఆర్‌పై ప్ర‌భావం ఎంత అనేది చ‌ర్చనీయాంశంగా మారింది.