Begin typing your search above and press return to search.

ఇరవై వైట్... డెబ్బై బ్లాక్... టోటల్ లక్షల కోట్లు !

మరోసారి గుడివాడ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. అలాంటి కొడాలి నాని మీడియా ముందు మాట్లాడుతూ చంద్రబాబు ఆస్తుల వివరాలను వెల్లడించారు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 3:52 AM GMT
ఇరవై వైట్... డెబ్బై బ్లాక్... టోటల్ లక్షల కోట్లు !
X

ఈ లెక్క ఏంటి దాని వెనుక తిక్క ఏంటి అని డౌట్లు ఎవరికైనా రావచ్చు. కానీ లెక్కలలో చాలానే మలుపులు ఉన్నాయి. వైట్ అంటే తెల్ల ధనం. జనాలకు తెలిసిన సొమ్ము. అలా ఇరవై వేల కోట్ల రూపాయలు ఆస్తి చంద్రబాబుకు ఉందిట. ఇక బ్లాక్ అంటే నల్లధనం డెబ్బై కోట్ల రూపాయలు ఉందిట. ఇవే కాదు భూముల రూపంలో కట్టడాల రూపంలో ఆస్తులు కలిపిస్తే అవన్నీ లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇలా లక్షల కోట్లకు అధిపతి అపర కుబేరుడు మన చంద్రబాబు అంటున్నారు.

ఈ లెక్కల చిట్టా తీసిన చిత్రగుప్తుడు ఎవరంటే టీడీపీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని. ఆయన వైసీపీలోనూ రెండు సార్లు గెలిచి మంత్రి అయ్యారు. మరోసారి గుడివాడ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. అలాంటి కొడాలి నాని మీడియా ముందు మాట్లాడుతూ చంద్రబాబు ఆస్తుల వివరాలను వెల్లడించారు.

బాబు వైట్ మనీని మాత్రమే ఆయన సతీమణి భువనేశ్వరి బయటపెట్టారని అన్నారు. హెరిటేజ్ లో రెండు శాతం షేర్లను విక్రయిస్తే నాలుగు వందల కోట్ల రూపాయలు వస్తాయని ఆమె చెప్పారని ఆ లెక్కన ఇరవై వేల కోట్ల రూపాయలు వైట్ మనీ అని కొడాలి చెప్పుకొచ్చారు. ఇక బయటకు రాని మొత్తం డెబ్బై కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందని ఆయన అంటున్నారు.

ఇవే కాదు, చంద్రబాబుకు కొండాపూర్, మాదాపూర్, అమరావతి, సింగపూర్, దుబాయ్ లలో లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. ఇవన్నీ కలిపి కూడితే ఆయన అపర కుబేరుడే అన్నారు. మరి ఇన్నేసి లక్షల కోట్ల రూపాయల ఆస్తులు బాబుకు ఎలా వచ్చాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు జస్ట్ రెండెకరాల ఆసామి అని ఆయన ఇన్ని వేల కోట్లకు ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బాబు పాపం ఇన్నాళ్ళకు పండబట్టే ఆయన జైలులో ఉన్నారని అన్నారు. తాను బాబు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ చదివానని ఆధారాలు పక్కాగా ఉన్నాయని అన్నారు. బాబు కేసులో దోపిడీ జరిగింది అని కోర్టులు నమ్మాయి కాబట్టే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేశాయని అలాగే క్వాష్ పిటిషన్ని కొట్టేశాయని ఆయన చెప్పారు.

ఇక బాబు తరఫున న్యాయవాదులు కేవలం టెక్నికల్ రీజన్స్ ని పట్టుకుని కేసు వాదిస్తున్నారని, గవర్నర్ కి చెప్పకుండా అరెస్ట్ అన్న పాయింట్ మీదనే వాదిస్తున్నారు తప్ప బాబు ఏ తప్పూ చేయలేదని అనడం లేదని గుర్తు చేశారు. తన జీవిత కాలంలో పద్దెనిమిది స్టేలను తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు మాత్రమే అన్నారు.

ఇక చూస్తే 2016లోనే సీఐడీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందన్నారు. కానీ అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడని అందుకే ఆపుకుంటూ వచ్చారన్నారు. తాను నిజాయతీపరుడిని అని బాబు చెబుతూ ఉంటారని ఇపుడు అసలు విషయం తెలిసిందని అన్నారు.

వినేవాడు ఉండాలే కానీ ఇంగ్లీష్ లో కూడా హరికధలు చెప్పగల సామర్ధ్యం బాబుకే ఉందని ఎద్దేవా చేశారు. తన పద్నాలుగేళ్ళ పాలనను చూసి ఓటేయాలని అడిగే దమ్ము బాబుకు లేదని అన్నారు. జగన్ తన పాలన చూసి ఓటేయమని అడుగుతున్నారని గుర్తు చేశారు. ఏపీలోనే అత్యంత అవినీతిపరుడు ఒక్క చంద్రబాబే అని కొడాలి నాని తేల్చేశారు.