Begin typing your search above and press return to search.

మరికొన్నాళ్లు ఆస్పత్రిలోనే కొడాలి నాని!

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని బైపాస్ సర్జరీ విజయవంతమైందని వైసీపీ నేతలు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   4 April 2025 12:35 PM IST
మరికొన్నాళ్లు ఆస్పత్రిలోనే కొడాలి నాని!
X

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని బైపాస్ సర్జరీ విజయవంతమైందని వైసీపీ నేతలు ప్రకటించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితుల ద్రుష్ట్యా మరో నెల రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సివుంటుందని ముంబై ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇన్సిట్యూట్ చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే కొడాలికి శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. సుమారు 8 గంటల పాటు ఆయన ఆపరేషన్ చేసిన వైద్యులు కొడాలి సేఫ్ గా ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన అవయువాలన్నీ బాగా స్పందిస్తూనే ఉన్నాయని, కొన్నాళ్లు ఐసీయూలో ఉండాల్సివుంటుందని చెబుతున్నారు. దీంతో నాని వైద్యుల పర్యవేక్షణలో ముంబైలోనే గడపాల్సివుంటుందని అంటున్నారు.

గత నెల 26న కొడాలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముందు గ్యాస్ సమస్యతో ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు హార్ట్ ప్రాబ్లం ఉందని గుర్తించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించాలని సూచించారు. వైద్యుల సలహా ప్రకారం కొడాలిని ముంబై తరలించిన కుటుంబ సభ్యులు అక్కడి ఏషియన్ హర్ట్ కేర్ సెంటర్ లో చికిత్స చేయించారు. ప్రస్తుతం కొడాలి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఇప్పటికే కొన్ని కేసులు నమోదు అవ్వగా, ప్రస్తుతం వాటిపై బెయిల్ రావడంతో సేఫ్ గా ఉన్నారు. కానీ, ఆయనపై ఇంకా తీవ్రమైన ఆరోపణలు ఉండటం, గతంతో శ్రుతిమించిన వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వ పెద్దల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కొడాలిని ఇరికించేలా పక్కా ప్లాన్ జరుగుతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

దీంతో ఆయన రాష్ట్రంలో కంటే ఎక్కువగా బయటే గడుపుతున్నారు. ఇదే సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారు. దాదాపు రెండు నెలలుగా ఆయన జైలులోనే గడుపుతండటంతో కొడాలి మరింత ఒత్తడికి గురయ్యారంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొడాలికి హుద్రోగ సమస్య తలెత్తిందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఆయన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతున్నాయి.