జగన్ రాజకీయ నాయకుడు కాదు...కొడాలి సెన్సేషనల్ కామెంట్స్ !
ఇక జగన్ రాజకీయాల్లోకి రావడానికి తన తండ్రి వైఎస్సార్ ఆశయాలే కారణం అని కొడాలి నాని అన్నారు. ఆయన కూడా అదే మాట అన్నారని చెప్పారు.
By: Satya P | 14 Sept 2026 10:21 PM ISTవైసీపీలో కొడాలి నాని మాజీ మంత్రి. ఫైర్ బ్రాండ్ అన్నది తెలిసిందే. ఆయన మీడియా ముందు మాట్లాడినా మీటింగ్ పెట్టి మాట్లాడినా తడుముకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు, కుండబద్ధలు కొడతారు అని పేరుంది. అలాంటి కొడాలి నాని జగన్ గురించి కూడా తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు. వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన తాజాగా మాట్లాడుతూ జగన్ రాజకీయ నాయకుడు కాదు అని సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్ మరి ఎందుకు పార్టీ పెట్టారు అంటే తన తండ్రి వైఎస్సార్ ఆశయాలను సాధించడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అని చెప్పారు. జగన్ కి రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే తెలుసు అని కొడాలి నాని అన్నారు. అందుకే ఆయన రెండు సార్లు ఓటమి పాలు అయ్యారు అని కూడా కొడాలి నాని చెప్పుకొచ్చారు.
వ్యాపారం చేసుకోకుండా :
ఇక జగన్ రాజకీయాల్లోకి రావడానికి తన తండ్రి వైఎస్సార్ ఆశయాలే కారణం అని కొడాలి నాని అన్నారు. ఆయన కూడా అదే మాట అన్నారని చెప్పారు. తాను హాయిగా వ్యాపారాలు చేసుకుంటే ఎవరు తనను ఒక్క మాట అనేది ఉండదు కదా అని చెబుతారు అని గుర్తు చేసుకున్నారు. కానీ తన తండ్రి వైఎస్సార్ ఆశయ సాధన కోసమే జగన్ పార్టీ పెట్టారని ఈ విషయంలో అధికారంలోకి వచ్చినా రాకపోయినా కూడా ఆయన బాధపడేది ఉండదని అన్నారు. వర్తమాన రాజకీయాలలో జగన్ మాత్రం తాను నమ్ముకున్నదే చేస్తారు కానీ ఒక్క అడుగు వెనక్కి వేయరని కొడాలి నాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
అప్పట్లో అలా :
ఇక 2014లో చూస్తే జగన్ వద్దకు తాము వెళ్ళి రైతు రుణ మాఫీ అన్న హామీ ఇవ్వమని అడిగామని కొడాలి నాని చెప్పారు. అప్పట్లో చంద్రబాబు బీజేపీ పవన్ కళ్యాణ్ లతో కలసి కూటమి కట్టడమే కాకుండా పెద్ద ఎత్తున హామీలను ఇస్తూ జనాలలోకి వెళ్తున్నారు అని గుర్తు చేశామని అన్నారు. అయితే దానికి జగన్ స్పందిస్తూ తాను అలాంటి అమలు చేయలేని హామీలు ఇవ్వలేను అన్నారని చెప్పారు. చంద్రబాబు ఇచ్చినా అమలు చేయలేరని కూడా ఆనాడే చెప్పారని సరిగ్గా అదే జరిగింది అని అన్నారు. ఇక 2024 ఎన్నికల ముందు కూడా తానూ పేర్ని నాని జగన్ వద్దకు వెళ్ళి చంద్రబాబు సూపర్ సిక్స్ అంటున్నారని అనేక హామీలతో వస్తున్నారని పైగా కూటమి కట్టారని చెప్పామని ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేశారు. వైసీపీ కూడా సంక్షేమ పధకాలను మరి కొన్ని అమలు చేస్తామని హామీ ఇస్తే బాగుంటుంది అంటే ఇప్పటికే ఇస్తున్న పధకాలతోనే ఇబ్బంది అవుతోందని కొత్తగా ఒక్కటి కూడా ఇవ్వలేమని జగన్ తెగేసి చెప్పారని నాని గుర్తు చేసుకున్నారు
జగన్ ఒక్కసారి అందుకే :
జగన్ నిజాయతీగా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు అని అందుకే ఆయన ఒక్కసారే సీఎం అయ్యారని, అదే చంద్రబాబు నాలుగు సార్లు సీఎం అయ్యారని కొడాలి నాని కామెంట్స్ చేశారు. నిజం ఒక్కసారి భూమిని చుట్టొచ్చేలోగా అబద్ధం ఆరు సార్లు చుడుతుందని సామెత ఉంది కదా ఏపీలో అదే జరుగుతోంది అని అన్నారు. రాజకీయాల్లో తాను నమ్మిన మాటకే కట్టుబడతాను అన్న జగన్ ఒక వైపు ఉంటే ఎలాగైనా అధికారమే అందుకోవాలని అదే పరమావధి అన్నట్లుగా ఉన్న చంద్రబాబు మరో వైపు ఉన్నారని ఈ ఇద్దరి మధ్యనే రాజకీయ సమరం సాగుతోందని కొడాలి నాని చెప్పారు. మొత్తానికి కొడాలి నాని చెప్పింది ఏంటి అంటే జగన్ రాజకీయాల్లో తప్పుడు మార్గాల ద్వారా అధికారం సంపాదించడానికి ఇష్టపడరు అని. అదే సమయంలో వ్యూహాలు ఎత్తుగడలు ఇవన్నీ కూడా రాజకీయాల్లో భాగం. జగన్ ఈ విషయంలో ప్రత్యర్ధుల ఎత్తుకు పై ఎత్తు వేయాల్సి ఉంటుంది. కానీ నమ్ముకున్నదే చేస్తాను అంటే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో కదా అన్నది కూడా వైసీపీలో చర్చగా ఉంది అనిపిస్తోంది.
