అదిగో కొడాలి నాని... హైదరాబాద్ పెళ్లి వేడుకలో మాజీ మంత్రి!
తీవ్ర అనారోగ్యంతో ముంబై ఆస్పత్రిలో చేరిన మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం కుదుటపడింది.
By: Tupaki Desk | 24 May 2025 2:22 PM ISTతీవ్ర అనారోగ్యంతో ముంబై ఆస్పత్రిలో చేరిన మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం కుదుటపడింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోనే ఓ వివాహ వేడుకకు హాజరైన కొడాలి వీడియోలు వైరల్ అవుతున్నాయి. తన అరెస్టుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ప్రచారం, లుక్ అవుట్ నోటీసుల జారీ వేళ కొడాలి బయటకు రావడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అరెస్టు పేరుతో తనను భయపెట్ట లేరని స్పష్టం చేసేందుకే ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారని వైసీపీ చెబుతోంది.
అనారోగ్యంతో కోలుకున్న కొడాలి నాని కొంతకాలం విశ్రాంతి తీసుకునేందుకు అమెరికా వెళతారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఆయనపై పెండింగు కేసులు బయటకు తీయడం వల్ల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన దేశం దాటకుండా ఉండేందుకు ప్రభుత్వం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దేశంలో అన్ని విమానాశ్రయాలతోపాటు నౌకాశ్రయాలకు ఆన్ లైన్ లో ఈ నోటీసులు పంపింది.
దీంతో కొడాలిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఎక్కువైంది. గుండె సంబంధిత అనారోగ్యంతో ముంబై ఆస్పత్రిలో రెండు నెలల క్రితం చేరిన కొడాలి ఆరోగ్యంపై ఆయన అభిమానులు, అనుచరులు, వైసీపీ కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో విజయవాడ వచ్చిన కొడాలి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తనను ఎవరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో నెక్ట్స్ కొడాలి ఎపిసోడ్ అంటూ టీడీపీ నేతలు ప్రకటనలు జారీ చేశారు.
అయితే కొడాలి నాని అనూహ్యంగా అనారోగ్యానికి గురికావడంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గిందని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం విమర్శలకు తగ్గలేదు. అరెస్టు నుంచి తప్పించుకోడానికే ఆరోగ్యంపై డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కానీ, ప్రభుత్వం మాత్రం కొడాలి విషయంలో ఆచితూచి వ్యవహరించిందని చెబుతున్నారు. కొడాలి ఆరోగ్యం కుదుటపడాక అరెస్టు చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఆ దిశగా పావులు కదిపిందని అంటున్నారు. మరోవైపు కొద్దికాలం రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనతో అమెరికా వెళ్లాలని కొడాలి ప్రయత్నించినట్లు జరిగిన ప్రచారంతో కూటమి పార్టీలు అలర్ట్ అయ్యాయంటున్నారు. దీంతో ముందుగా ఆయనను కట్టడి చేసేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయించారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో తాను అన్నింటికి రెడీ అన్న సంకేతాలు పంపేలా కొడాలి నాని బయటకు వచ్చారు. ఓ వివాహ వేడుకకు హాజరై తాను భయపడటం లేదని, ఎక్కడా దాక్కోలేదన్న విషయాన్ని తెలియజేశారు. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఆ తర్వాత కూడా కొడాలి నాని అప్పటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. అయితే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆ దిశగా విచారణ జరిపించింది. ముందుగా ఇసుక కుంభకోణంలో ఆయనను అదుపులోకి తీసుకోవచ్చనని అంటున్నారు. తాజాగా నియమించిన సిట్ కొడాలి టార్గెట్ గా తొలి అడుగు వేసే అవకాశం ఉందంటున్నారు.
