Begin typing your search above and press return to search.

కొడాలి నాని హెల్త్ అప్టేట్.. జగన్ కు సమాచారం.. ఏం జరిగిందంటే?

తాజాగా కొడాలి నాని డిశ్చార్జ్ సమాచారాన్ని ఆయనకు చేరవేశారు.

By:  Tupaki Desk   |   14 April 2025 5:40 PM IST
కొడాలి నాని హెల్త్ అప్టేట్.. జగన్ కు సమాచారం.. ఏం జరిగిందంటే?
X

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి తాజాగా కీలక సమాచారం వెలువడింది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.

ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, కొడాలి నానికి నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

శస్త్రచికిత్స అనంతరం కొడాలి నానిని తొలుత ఐసీయూలో ఉంచగా, ప్రస్తుతం సాధారణ గదికి తరలించారు. ఆయన నెమ్మదిగా నడుస్తున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైద్యుల అంచనా ప్రకారం, ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

డిశ్చార్జ్ అనంతరం కొడాలి నాని హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏజీఐ)లో తదుపరి చికిత్స తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నందున కొంతకాలం హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. వచ్చే నెలలో మరోసారి ముంబైలోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

కాగా, కొడాలి నాని ఆరోగ్యంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తాజాగా కొడాలి నాని డిశ్చార్జ్ సమాచారాన్ని ఆయనకు చేరవేశారు. దీంతో, కొడాలి నానిని పరామర్శించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ముంబై వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కొడాలి నాని పూర్తిగా కోలుకున్నప్పటికీ, కొంతకాలం పాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు.

ముందుగా హైదరాబాద్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొడాలి నాని గుండెలో మూడు రక్తనాళాలు పూడుకుపోయినట్లు గుర్తించారు. దీంతో బైపాస్ సర్జరీ అవసరమని వైద్యులు నిర్ధారించడంతో ఆయనను ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. ఈ నెల 2న దాదాపు 8 గంటల పాటు ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. సర్జరీ అనంతరం వైద్యులు వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

ప్రారంభంలో నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించినప్పటికీ, కొడాలి నాని ఆరోగ్యం మెరుగుపడటంతో మిగిలిన చికిత్సను హైదరాబాద్‌లో కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 20న ఆయన ముంబై నుంచి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. అయితే, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ఎవరినీ కలిసే అవకాశం లేదని తెలుస్తోంది.