కొడాలిని క్షమించేదే లేదు.. కొత్తగా మరో కేసు, అరెస్టుకే మొగ్గు?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసుల వేట కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో ఒక కేసులో కొడాలిని అరెస్టు చేసి జైలుకు పంపుతారని ప్రచారం జరిగింది.
By: Tupaki Desk | 3 Aug 2025 11:22 PM ISTవైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసుల వేట కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో ఒక కేసులో కొడాలిని అరెస్టు చేసి జైలుకు పంపుతారని ప్రచారం జరిగింది. కొడాలి మంత్రిగా ఉండగా, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసేవారు. దీంతో ఆయన టీడీపీ అధిష్టానానికి టార్గెట్ అయ్యారని చెబుతారు. ఎన్నికల ఫలితాలు విడుదల అయిన సమయంలోనే కొడాలి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సంఘటనతో ఆయనపై టీడీపీకి ఎంత కోపం ఉందన్న విషయం బయటపడింది. దీంతో ఓటమి తర్వాత కొడాలి చాలా కాలం అండర్ గ్రౌండుకు వెళ్లిపోయారని చెబుతారు. లేనిపోని వివాదాలు సృష్టించుకోవడం కన్నా, మౌనంగా గడపడమే బెటరన్నఆలోచనతో మాజీ మంత్రి కొడాలి తన నియోజకవర్గాన్ని వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు. దాదాపు ఏడాదిగా ఆయన నియోజకవర్గానికి వచ్చింది చేతి వేళ్లమీద లెక్క పెట్టొచ్చని అంటారు.
కొన్నాళ్లు అజ్ఞాతంలో కొడాలి
కేసులు, టీడీపీ కార్యకర్తల ఆగ్రహావేశాల కారణంగా కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిన కొడాలి నాని మధ్యలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఆయనపై కేసుల జాబితాను బయటకు తీస్తోంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజుల వ్యవధిలోనే రెండు మూడు కేసులు పెట్టగా, అప్పట్లో కొడాలి ముందస్తు బెయిలు తెచ్చుకున్నారు. ఇక గుడివాడలో నమోదైన కేసుల్లోనూ అనారోగ్య కారణాలతో కండీషన్ బెయిలు తెచ్చుకున్నారు కొడాలి. అయితే ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదు చేసిన ప్రభుత్వం నానిని హైదరాబాద్, గుడివాడ కాకుండా ఉత్తరాంధ్రకు తీసుకువెళుతోంది.
2024లోనే కేసు
కొడాలి ఎమ్మెల్యేగా ఉండగా, 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లోనే విశాఖ త్రిటౌన్ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. కొడాలి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ద్వారా చంద్రబాబు అభిమానుల ఆత్మాభిమానం దెబ్బతిన్నదని విశాఖ వాసి అంజనా ప్రియ అప్పట్లోనే కొడాలిపై ఫిర్యాదు చేశారు. అయితే ఇన్నాళ్లు ఈ కేసును కోల్డ్ స్టోరీజ్ లో పెట్టిన పోలీసులు తాజాగా బయటకు తీశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు రమ్మంటూ ఆదివారం కొడాలికి నోటీసులు జారీ చేశారు. గుడివాడలో కొడాలి ఇంటికి వెళ్లిన పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులను ఆయన ఇంట్లో అందజేశారు. దీంతో కొడాలి అరెస్టుకు ఉత్తరాంధ్రను వేదిక చేసుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడ జైళ్లు కిటకిట
ప్రస్తుతం వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎక్కువగా సోషల్ మీడియా కేసులతో క్యాడర్ ను అరెస్టు చేసిన ప్రభుత్వం.. లిక్కర్ స్కాంపై వైసీపీ బడా నేతలనే టార్గెట్ చేసింది. మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులైన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేసింది. ఈ కేసులో నేడో రేపో జగన్ వరకు వెళ్లొచ్చు అనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు ఈ అరెస్టులతో విజయవాడలో ఉన్న జైలు కిటకిటలాడుతోంది. ఈ పరిస్థితుల్లో కొడాలిని అరెస్టు చేయాల్సివస్తే, అందుకు వేదికగా విశాఖను ఎంచుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ నగరం టీడీపీకి కంచుకోట, గతంలోనూ ఇప్పుడు అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలే వరుసగా గెలుస్తున్నారు. కొడాలి వంటి నేతను అరెస్టు చేసి విశాఖలో ఉంచితే వైసీపీ కార్యకర్తలను అదుపు చేయొచ్చనే అభిప్రాయంతోనే విశాఖ కేసును బయటకు తీశారని సందేహిస్తున్నారు. అయితే కొడాలి ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కూడా లేవని టీడీపీలో ఓ వర్గం చెబుతోంది. మొత్తానికి కొడాలికి నోటీసులివ్వడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మరో రచ్చ మొదలైందని అంటున్నారు.
