'కొడాలి అరెస్టు'.. రంగంలోకి పోలీసులు!
మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి అరెస్టు వార్తలపై పోలీసులు రంగంలోకి దిగారు.
By: Tupaki Desk | 21 Jun 2025 1:00 AM ISTమాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి అరెస్టు వార్తలపై పోలీసులు రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం కొడాలి కోల్ కతాలో అరెస్టు అయ్యారని, ఆయన కొలంబో వెళుతుండగా, ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే కొడాలి అరెస్టు కానప్పటికీ ఆ ప్రచారం ఎందుకు చేశారు? ఎవరు చేశారన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. కొడాలి అరెస్టు వార్తల ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తీసుకురావాలని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు చెబుతున్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని ప్రభుత్వం మెయిన్ టార్గెట్లో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ లో మొదటి పేజీలోనే కొడాలి పేరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొడాలి తన నోటికి పనిచెప్పేవారు. దీంతో ఆయనను అరెస్టు చేయాలనేది టీడీపీలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెబుతారు. అయితే వివిధ కారణాలతో ఇంతవరకు ప్రభుత్వం కొడాలిపై చర్యలకు దిగలేదు.
ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొడాలికి వ్యతిరేకంగా రెండు మూడు కేసులు నమోదయ్యాయి. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ఇలా పలు వ్యవహారాల్లో కొడాలి ప్రమేయం ఉన్నట్లు కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని కేసుల్లో ఆయనకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. మరోవైపు ఏ క్షణంలో అయినా తనను అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో కొడాలి కొన్నాళ్లు బయటకు రాకుండా గుట్టుగా ఉంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఏడాది కాలంలో కేవలం రెండు మూడు సార్లు మాత్రమే ఆయన విజయవాడ వచ్చారు. ఎక్కువగా హైదరాబాదులోనే గడుపుతున్నారు. ఇదే సమయంలో ఆయన సహచరుడు వంశీ అరెస్టు అవడంతో కొడాలి ఆందోళనకు లోనయ్యారని చెబుతారు.
వంశీ అరెస్టు తర్వాత కొడాలిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే కొడాలి అనూహ్యంగా అనారోగ్యానికి గురవడంతో అరెస్టు ప్రయత్నాలకు బ్రేక్ పడిందని అంటున్నారు. కొడాలి ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాకే ఆయనపై చర్యలు ఉంటాయని వైసీపీ కూడా భావిస్తోంది. అయితే ఇప్పటికీ ఆయన మెడికల్ సపోర్టుతోనే తిరుగుతున్నారని చెబుతున్నారు. కానీ, రెండు రోజుల క్రితం ఆయన కొలంబో వెళ్లే ప్రయత్నంలో కోల్ కతాలో అరెస్టు అయ్యారన్న వార్తలు ఒక్కసారిగా ప్రచారంలోకి వచ్చాయి.
ఏపీ పోలీసులకు సంబంధం లేకపోయినా, ఈ వార్తలు ప్రచారం అవ్వడం వెనుక ఎవరైనా కుట్ర పన్నారా? అనేది ప్రభుత్వం తెలుసుకోవాలని అనుకుంటోందని అంటున్నారు. దీంతో వార్తలు ఎక్కడ నుంచి వచ్చాయనేది తెలుసుకోడానికి పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ పలువురి అనుమానితులపై నిఘా వేసినట్లు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో పూర్తిగా తెలుస్తుందని చెబుతున్నారు.
