కొడాలి అరెస్టు.. కోల్ కతాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు!?
మాజీ మంత్రి కొడాలి నానిని కలకత్తాలో అరెస్టు చేశారన్న ప్రచారం జోరందుకుంది. బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ న్యూసే వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 18 Jun 2025 12:41 PM ISTఏపీ లిక్కర్ స్కాంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారన్న సమాచారంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతుండగా, వారిని మరింత కంగారు పెట్టే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన కీలక నేత, ఫైర్ బ్రాండ్, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెయిన్ టార్గెట్ అయిన మాజీ మంత్రి కొడాలి నానిని కలకత్తాలో అరెస్టు చేశారన్న ప్రచారం జోరందుకుంది. బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ న్యూసే వైరల్ అవుతోంది.
కోల్ కత్తా నుంచి కొలంబో వెళ్తుండగా, కొడాలిని అదుపులోకి తీసుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. లుకౌట్ నోటీసులు ఉండటంతో ఆయన విదేశాలకు వెళ్లే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారని, ఏపీ పోలీసులకు సమాచారమిచ్చారని అంటున్నారు. అయితే ఈ ప్రచారం నిజమని ఇంతవరకు పోలీసులు నిర్ధారించలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీంతో ఏం జరిగిందని వైసీపీ శ్రేణులు ఆరా తీస్తున్నాయి.
మాజీ సీఎం జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టు వేళ.. కొడాలినీ అరెస్టు చేశారనే ప్రచారం వైసీపీ కార్యకర్తలకు టెన్షన్ పుట్టిస్తోందని అంటున్నారు. గత ప్రభుత్వంలో కొడాలి చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనను అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ప్రధానంగా కొడాలి నాని, వల్లభనేని వంశీని అరెస్టు చేయాలని టీడీపీ కేడర్ డిమాండ్ చేస్తుండేది. అయితే వల్లభనేని అరెస్టు తర్వాత అందరి ఫోకస్ కొడాలిపైకి మళ్లింది. అయితే ఆయన అనారోగ్యంతో కొన్నాళ్లుగా కొడాలి అరెస్టుపై ఎలాంటి ప్రచారం జరగడం లేదు.
అయితే, కొడాలిని ఎప్పుడైనా అరెస్టు చేస్తారని, ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదటపడే వరకు ప్రభుత్వం ఎదురుచూస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో కొడాలి ఎప్పటికైనా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ఓ అంచనాకు వచ్చిందని చెబుతున్నారు. అయితే కోల్ కతా నుంచి కొలంబో వెళ్లే ప్రయత్నంలో కొడాలిని అరెస్టు చేశారన్న ప్రచారంపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. పోలీసులు, కొడాలి అనుచరులు, కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రకటనను ధ్రువీకరించలేదు. దీంతో కొడాలి అరెస్టు ఫేక్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
