Begin typing your search above and press return to search.

విశాఖ జిల్లాలో ఓకే రాజు అవుతారా ?

వైసీపీ అధినాయకత్వం విశాఖ జిల్లా విషయంలో చేసినన్ని ప్రయోగాలు ఏ జిల్లాలో చేసి ఉండదు.

By:  Tupaki Desk   |   30 April 2025 3:48 AM
విశాఖ జిల్లాలో ఓకే రాజు అవుతారా  ?
X

వైసీపీ అధినాయకత్వం విశాఖ జిల్లా విషయంలో చేసినన్ని ప్రయోగాలు ఏ జిల్లాలో చేసి ఉండదు. ఎంతో మంది వైసీపీ ప్రెసిడెంట్లుగా పనిచేశారు. మొదట వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి బాధ్యతలు ఇచ్చారు. ఆ తరువాత గుడివాడ అమర్నాధ్, మధ్యలో మళ్ళీ అవంతి శ్రీనివాస్, ఆయన తరువాత కోలా గురువులు, మళ్ళీ గుడివాడ అమర్నాధ్, ఇపుడు చూస్తే ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ అయిన కేకే రాజు

ఇలా వైసీపీ విశాఖ జిల్లాకు అధ్యక్షులను నియమించుకుని పోతూనే ఉంది. అయితే ఎవరిని నియమించినా అది టీడీపీకి కంచుకోట. 2019లో బలంగా వైసీపీ ప్రభంజనం వీచినప్పుడే ఈ జిల్లాలో నాలుగు సీట్లూ టీడీపీ పరం అయ్యాయి. ఇక 2024కి వచ్చేసరికి వైసీపీకి ఒక్క సీటూ ఇవ్వకుండా జిల్లాను టీడీపీ కూటమి ఊడ్చిపారేసింది.

ఇపుడు చూస్తే విశాఖ మేయర్ పదవిని కూడా కైవశం చేసుకుని దూకుడు రాజకీయం చేస్తోంది. ఎంతో మంది ఉద్దండులైన రాజకీయ నేతలు అంతా టీడీపీలో ఉన్నారు. అలాగే క్యాడర్ బలంగా ఉంది. బీజేపీ జనసేన మిత్రులు కావడంతో కూటమి బలం మరింతగా పెరిగింది.

దీంతో కూటమిని విశాఖలో రాజకీయంగా ఓడించి వైసీపీ ఫ్యాన్ ని గిర్రున తిప్పే మొనగాడి కోసం అధినాయకత్వం ఎంతో ఆలోచించి చివరికి కేకే రాజుని నియమించింది. ఆయన అంగబలం అర్ధ బలం కలిగిన నాయకుడిగా ఉన్నారు. జగన్ కి ఆయన అత్యంత సన్నిహితుడుగా పేరు గడించారు.

అయితే ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో తెలియదు పైగా పది మంది నాయకులను కలుపుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీతో ఢీ కొట్టడం అంటే సామాన్యమైన విషయం అయితే కాదు ఈ నేపధ్యంలో రాజుకు ఈ పదవిని అప్పగించడం ద్వారా జగన్ ఒక సవాల్ నే ఆయన ముందు ఉంచారు అని అంటున్నారు.

ఇక విశాఖ జిల్లా బీసీల కోటగా ఉంది. యాదవులు, గవరలు, వెలమలు అత్యధిక సంఖ్యలో ఉంటారు. అలాగే కాపులు హెచ్చుగా ఉంటారు. అలాంటి చోట అగ్ర కులానికి చెందిన రాజుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగినడం ద్వారా వైసీపీ ఏ రకమైన సామాజిక సమీకరణలకు తెర తీస్తోంది అన్నది చూడాల్సి ఉంది.

విశాఖ జిల్లాలో అగ్ర కులస్థుల జనాభా కూడా గణనీయంగా ఉన్నప్పటికీ బీసీలతోనే రాజకీయం మొత్తం నడుస్తోంది. టీడీపీ వెలమ సామాజిక వర్గానికి చెందిన గండి బాబ్జీకి జిల్లా బాధ్యతలు అప్పగించింది. ఇక జనసేన కాపులకు ఆ బాధ్యతలు ఇచ్చింది. బీజేపీ మాత్రం రాజులకు అధ్యక్ష స్థానం అందించింది. ఇపుడు అదే బాటలో వైసీపీ రాజులకే కిరీటం తొడిగింది.

తాజాగా తాడేపల్లిలో జరిగిన జిల్లా అధ్యక్షుల సమావేశం సందర్భంగా జగన్ తో కేకే రాజు భేటీ అయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతలకు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో జగన్ కూడా ఆయనకు దిశా నిర్దేశం చేశారు విశాఖ జిల్లాలో పార్టీకి మొత్తం సీట్లు గెలిపించుకుని రావాలని కోరారని అంటున్నారు. మరి కేకే రాజు ఓకే రాజు అవుతారా అన్నదే చర్చగా ఉంది.