Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి కేకే సర్వేస్ కిరణ్.. స్థానిక ఎన్నికల్లో పోటీపై సంచలన ప్రకటన

ఎన్నికల సర్వేల ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ అధినేత కొండేటి కిరణ్ (కేకే) రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచన చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   3 Oct 2026 11:21 AM IST
రాజకీయాల్లోకి కేకే సర్వేస్ కిరణ్.. స్థానిక ఎన్నికల్లో పోటీపై సంచలన ప్రకటన
X

ఎన్నికల సర్వేల ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ అధినేత కొండేటి కిరణ్ (కేకే) రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచన చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అత్యంత కచ్చితత్వంతో అంచనాలు వెలువరించి మంచి పేరు తెచ్చుకున్న కిరణ్ తాజాగా ఏకం అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. దీనిద్వారా వచ్చే స్థానిక ఎన్నికల్లో 1.60 లక్షల మందిని పోటీలో పెడుతున్నట్లు ప్రకటించారు. స్థానిక ఎన్నికల ముందు కిరణ్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది.

రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుండగా, ఆయా పార్టీల వల్ల ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదని చెబుతూ తమ సంస్థ తరఫున అభ్యర్థులను పోటీ పెడతామని కేకే ప్రకటించారు. విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్ లో రాష్ట్రంలో వివిధ సమస్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన, 2014-19 మధ్య పరిస్థితులకు ఇప్పటికి ఎలాంటి మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. గతంలోని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన పనులు జరగడం లేదని ఆరోపించారు. నిరుద్యోగం ఎక్కువగా ఉందని, తాగు, సాగునీటి సమస్యలు, కనీస మౌలిక సదుపాయాలలో రాష్ట్రంలో చాలా వెనుకబడి ఉందని విమర్శలు చేశారు.

ఈ సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న వారిని ఏకం చేయడానికి తాను ‘ఏకం’ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకే మాట, ఒకే నినాదంతో 1.60 లక్షల మంది ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదించాలని కోరారు. అంతేకాకుండా తన సంస్థ తరఫున పోటీ చేసే వారి కోసం ప్రచారం చేస్తానని వివరించారు. ప్రభుత్వాలు మారుతున్నా, సమస్యలు పరిష్కారం కావడం లేదని 70 శాతం మంది అసంతృప్తితో ఉన్నారని కేకే ప్రకటించారు. ఇదే సమయంలో స్థానిక ఎన్నికలు ప్రజల కోసమని ఆయన అభివర్ణించారు. ఈ ఎన్నికలకు పార్టీలతో సంబంధం ఉండదని వ్యాఖ్యానించడం గమనార్హం.

అసలు లక్ష్యం ఏంటి?

ఎన్నికల సమయంలో సర్వేల పేరుతో గుర్తింపు తెచ్చుకున్న కేకే ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచన చేస్తున్నారా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన ఉంటే ఇంకో విధంగా ప్రయత్నించవచ్చునని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీసం మాట్లాడని కేకే స్థానిక ఎన్నికల ముందు ఏవేవో లెక్కలు చూపుతూ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. తన స్ట్రాటజీ ద్వారా ప్రజల్లో చర్చ జరగాలని కేకే కోరుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఇక 1.60 లక్షల మందిని పోటీ పెట్టడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి బలగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. అయితే కేకే మాటలను విశ్వసించి ఎంత మంది పోటీకి ముందుకు వస్తారో చూడాల్సివుందని అంటున్నారు.

రాజకీయాలు అంత ఈజీనా?

అధికార, విపక్షాలు హోరాహోరీగా తలపడే ఎన్నికల క్షేత్రంలో ఎటువంటి బలం, బలగం లేకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఎవరైనా పోటీకి విజయం సాధించగలరా? అన్నదే చర్చనీయాంశం అవుతోంది. మాటలు చెప్పినంత తేలిగ్గా ప్రజల మనస్సులను గెలుచుకోవడం సాధ్యం కాదని అంటున్నారు. ఎన్నికల ముందు వచ్చి తమకు ఓటు వేయండని అడిగితే ప్రజలు ఆదరిస్తారన్న గ్యారెంటీ లేదని అంటున్నారు. ఇక ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా, కేవలం మీడియా, సోషల్ మీడియాలో గుర్తింపుతో క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం ద్వారా కేకే ఏం సాధించగలరో చూడాల్సివుందని అంటున్నారు.