‘రిచ్ డాడ్.. పూర్ డాడ్’ రచయిత వైరల్ పోస్టు
ప్రపంచంలో ఉన్న పుస్తకాల్లో తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాల జాబితాలో ఉండే ఒక పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్.
By: Tupaki Desk | 4 May 2025 5:00 PM ISTప్రపంచంలో ఉన్న పుస్తకాల్లో తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాల జాబితాలో ఉండే ఒక పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ పుస్తకం బోలెడన్ని భాషల్లో లభ్యమవుతంది. నిజానికి పుస్తకం ద్వారా ‘రాబర్ట్ కియోసాకి’ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఈ పుస్తకానికి ముందు.. తర్వాత పలు బుక్స్ రాసినప్పటికి ఈ పుస్తకం పొందినంత ఆదరణ మరే పుస్తకం పొందలేదనే చెప్పాలి. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఒక సుదీర్ఘ పోస్టు పెట్టారు.
సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఈ పోస్టు చదివినంతనే టెన్షన్ పుట్టేయటం ఖాయం. వైరల్ గా మారిన ఈ పోస్టులో ఆయన పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. భయపెడుతూనే బెదిరిపోవద్దన్న సందేశాన్ని ఇచ్చిన ఆయన పోస్టును చదవాల్సిందే. రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు.. వాటి కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురు కానున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా వచ్చే అవకాశాల గురించి చర్చించారు.
ఇంతకూ ఆయన ఏమన్నారంటే.. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మార్కెట్ క్రాష్ అవుతాయి. గుర్తుంచుకోండి. అయితే.. వీటికి భయపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్దంగా ఉండండి. దీన్నో అవకాశంగా తీసుకోండి. మార్కెట్ పతనం అయ్యే వేళ.. చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. ఆ సమయంలోనే నిజమైన ఆస్తులు అమ్మకానికి వస్తాయి. అనేక కారణాలతో మార్కెట్లు అల్లకల్లోలం సంభవిస్తుంది. ఆర్థిక సంక్షోభాన్ని తిప్పి కొట్టేందుకు.. అభ్యాసంగా మార్చుకోవాలి’’ అని వివరించారు.
ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర ప్రశ్నను సంధించారు. బిట్ కాయిన్ విలువ 300 డాలర్లకు పతనమైతే బాధ పడతారా? సంతోషిస్తారా? అని ప్రశ్నిస్తూ.. ‘ఇదే జరిగితే బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టేందుకు ఒక చక్కటి అవకాశం అవుతుంది. ఆర్థిక మాంద్యం గురించి ప్రజలు సిద్ధంగా ఉండాలి. మార్కెట్లు క్రాష్ అయ్యే వేళలో వారెన్ బఫెట్ మాదిరి ఆలోచించి.. పెట్టుబడులు పెట్టాలి’’ అంటూ సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల కొటేషన్లను తన పోస్టుకు జోడించటం గమనార్హం. సంక్షోభంలో అవకాశాల్ని సొంతం చేసుకోవచ్చన్న విషయాన్ని గుర్తించాలన్న ఆయన మాటలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పక తప్పదు.
