Begin typing your search above and press return to search.

కాళేశ్వరంపై కిషన్ రెడ్డి సీబీఐ సవాలుకు ప్రెస్ మీట్ పెట్టి దులిపేసిన ఉత్తమ్

కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 5:45 AM GMT
కాళేశ్వరంపై కిషన్ రెడ్డి సీబీఐ సవాలుకు ప్రెస్ మీట్ పెట్టి దులిపేసిన ఉత్తమ్
X

కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని.. సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు.. కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నెల కూడా కాకముందే పని గట్టుకొని విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద సీబీఐ విచారణ కోరాలన్న కిషన్ రెడ్డి చేస్తున్న రాజకీయ విమర్శలపైనా ఉత్తమ్ భారీ కౌంటర్ ఇచ్చారు.

కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రూల్స్ ను మార్చారన్న ఉత్తమ్.. ''స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు. బ్యాంకులు.. ఇతర సంస్థల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం రుణాలు ఇప్పించింది. పవర్.. ఇరిగేషన్ కార్పొరేషన్ కు నిబంధనలు మార్చేసి మరీ రుణాల్ని ఇచ్చేశారు. ప్రాజెక్టు కోసం రూ.1.27 లక్షల కోట్లు మంజూరు చేవారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకే రూ.60వేల కోట్ల లోన్ బీజేపీ ఇప్పించింది. దోచుకుందాం అని లక్షల కోట్లు ఇచ్చారా?'' అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

మేడిగడ్డ 5 అడుగులు కుంగితే కిషన్ రెడ్డి కనీసం పరిశీలన చేయలేదని.. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితే ఎందుకు విజిట్ చేయలేదు? అంటూ ప్రశ్నించారు. ‘‘రూ.80వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.27 లక్షల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చింది? సీబీఐ ..ఈడీ అంటూ కిషన్ రెడ్డి ఇప్పుడేదో మాట్లాడుతున్నారు. ప్రతిపక్షనాయకులు ఏ తప్పు చేయకున్నా ఈడీ కేసులు వేసిన బీజేపీ.. కేసీఆర్ పై ఎందుకు వేయలేదు? కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా..మోడీ.. నడ్డాలు కేంద్ర విచారణ సంస్థను ఎందుకు ఆదేశించలేదు?’’ అంటూ మంత్రి ఉత్తమ్ కడిగేశారు.

నిజానికి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు.. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు చేశారే కానీ కేంద్ర విచారణ సంస్థలకు ఎందుకు ఆదేశించలేదన్నది కోటి రూకల ప్రశ్నగా చెప్పక తప్పదు. ఇప్పుడు ఆ అంశాన్నే ప్రత్యేకంగా ప్రస్తావించిన ఉత్తమ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి.. ఆయన కౌంటర్ కు కిషన్ రెడ్డి ఏ తీరులో రియాక్టు అవుతారో చూడాలి.