Begin typing your search above and press return to search.

బండి టీంకు బైబై.. హవా అంతా కిషన్ రెడ్డి జట్టుదేనట

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధినాయకత్వం గుర్రుగా ఉండటమే కాదు

By:  Tupaki Desk   |   31 Dec 2023 5:09 AM GMT
బండి టీంకు బైబై.. హవా అంతా కిషన్ రెడ్డి జట్టుదేనట
X

తెలంగాణ బీజేపీలో సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధినాయకత్వం గుర్రుగా ఉండటమే కాదు.. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా.. రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలకు తీవ్రమైన వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. ఇప్పటికైనా విభేదాలు మాని.. ఉమ్మడిగా పని చేయాలన్న హితవు పలకటంతో పాటు.. పార్టీ పరంగా సంస్థాగతంగా చేయాల్సిన బార్పులు చేర్పులపైనా క్లాస్ పీకినట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొత్త ఆపరేషన్ ను షురూ చేసినట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా దీర్ఘకాలంగా పార్టీ పదవుల్ని అనుభవిస్తూ.. ఫలితాలు పెద్దగా రాని పార్టీ అధ్యక్షులపై వేటు వేసేందుకు కిషన్ రెడ్డి డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా మారిన జిల్లాల స్వరూపంలో 38 జిల్లాల్లోని అత్యధిక చోట కొత్త అధ్యక్షుల్ని నియమించేందుకు వీలుగా కిషన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా బండి ముద్ర ఉన్న వారిని.. ఆయనకు అనుకూలంగా ఉండే వారిని దూరం పెట్టే చర్యలు షురూ అయినట్లుగా చెబుతున్నారు.

పలు జిల్లా అధ్యక్షులు నాలుగేళ్లుగా పదవిలో ఉన్న వేళ.. వారికి అప్పగించిన పనులు.. వారు సాధించిన విజయాల్ని పరిగణలోకి తీసుకొని అందుకు తగ్గట్లు మార్పులు ఉంటాయని చెబుతున్నారు. మరో మూడు నెలల్లో కీలకమైన లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పక్కాగా పని చేసి.. ఫలితాల్ని తమకు అనుకూలంగా తెచ్చేలా పని చేసే వారికి పదవులు అందజేయాలన్న పట్టుదలతో కిషన్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల పరిధిలో పార్లమెంట్ కమిటీలను నియమించటంతో పాటు.. అసెంబ్లీ ఎన్నికల్లోపార్టీ తరఫు పెద్దగా పని చేయని వారిపై వేటు వేసేందుకు కిషన్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేశారన్న ఆరోపణలు ఉన్న సీనియర్లకు సైతం పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇలా షోకాజ్ నోటీసులు అందుకునే వారిలో దాదాపు ముగ్గురు జిల్లా అధ్యక్షుల తో పాటు పది మంది రాష్ట్రస్థాయి నాయకులు కూడా ఉంటారని చెబుతున్నారు. నోటీసులు అందజేసిన తర్వాత వారు స్పందించే తీరు ఆధారంగా చర్యలు ఉంటాయని తెలుస్తోంది. తాజా పరిణామాలు చూస్తే.. బండి టీంకు బైబై చెప్పేయటంతో పాటు.. తన టీంతో నింపేసేలా కిషన్ రెడ్డి నిర్ణయాలు ఉంటాయంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.