Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీని న‌డిపించే వారు దొర‌క‌ట్లేదు: కిష‌న్‌రెడ్డి

ఈ ప‌ద‌విపై తాజాగా ప్ర‌స్తుత బీజేపీ చీఫ్‌.. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

By:  Tupaki Desk   |   15 April 2025 9:40 AM
Kishan Reddy On BJP Leadership
X

తెలంగాణ బీజేపీ చీఫ్ కోసం పార్టీ అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు కొంద‌రు నాయ‌కులు కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ ప‌ద‌విపై తాజాగా ప్ర‌స్తుత బీజేపీ చీఫ్‌.. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో త‌న‌ను ఈ విష‌యంలో విమ‌ర్శ‌లు చేస్తున్న వారికి ఆయన ప‌రోక్షంగా చుర‌క‌లు అంటించారు.

``తెలంగాణ బీజేపీని న‌డిపించే వారికి చాలా శ‌క్తి అవ‌స‌రం. మునుప‌టిక‌న్నా ఇప్పుడు రాజ‌కీయాలు మారిపోయాయి. ఏదో ఒక అజెండాను ప‌ట్టుకుని ముందుకు వెళ్తామంటే.. కుద‌ర‌దు. సమాజంలోనూ మార్పు వ‌చ్చింది. ప్ర‌ధాని మోడీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న ఉంది. దీనిని కూడా అంచ‌నా వేసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న ప్ర‌జ‌ల మూడ్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. ఆవేశాలు, కావేశాలు ఎందుకు? అంద‌రినీ క‌ల‌సి క‌ట్టుగా ముందుకు న‌డిపించాలి. అందుకే.. బీజేపీ న‌డిపించేవారు అప్ప‌టి క‌ప్పుడు దొర‌క‌ట్లేదు`` అని కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం బీజేపీ చీఫ్‌గా ఉన్న త‌న‌కు మ‌రోసారి ఎక్స్‌టెన్ష‌న్ ఇవ్వాల‌ని కోరుతున్న వ‌స్తున్న వాద‌న‌ను కూ డా ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. త‌న‌పై ఎవ‌రో చేసే విమ‌ర్శ‌ల‌కు తాను స‌మాధానం చెప్ప‌బోన‌ని చెప్పారు. అయితే.. పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు ఉన్నాయ‌ని. ఇవ‌న్నీ.. టీ క‌ప్పులో తుఫాను మాదిరేన‌ని తెలిపారు. కాబ‌ట్టి... వాటిని లైట్ తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. దేశ‌వ్యాప్తంగా బీజేపీ పుంజుకుంటోంద‌ని.. గ‌తేడాది జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల్లో మార్పు వ‌చ్చింద‌ని.. బ‌ల‌మైన పార్టీగా.. బీజేపీని, కూట‌మిగా ఎన్డీయేని ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నార‌ని తెలిపారు.