బీజేపీలో జగన్ మిత్రుడు
భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీకి ఎంతో మంది మిత్రులు ఉన్నారు. ఆ పార్టీ 80వ దశకం నుంచి బీజేపీతో పొత్తులు పెట్టుకుంటూనే ఉంది.
By: Tupaki Desk | 16 Jun 2025 8:57 AM ISTభారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీకి ఎంతో మంది మిత్రులు ఉన్నారు. ఆ పార్టీ 80వ దశకం నుంచి బీజేపీతో పొత్తులు పెట్టుకుంటూనే ఉంది. అలా స్నేహ బంధం బలపడింది పైగా భావ సారూప్యత కలిగిన పార్టీలుగా ఉన్నాయి.
వైసీపీ అయితే బీజేపీతో రాజకీయంగా భావ సారూప్యత కలిగిన పార్టీ కాదు, ఇక బీజేపీతో జగన్ కి రాజకీయాల్లోకి వచ్చాక అనివార్యమైన ఒక పరోక్ష బంధం ఏర్పడింది అని అంటారు. అది 2014 నుంచి 2019 దాకా ఒకలా ఆపై 2019 నుంచి 2024 దాకా మరోలా మారింది. ఇక 2024లో టీడీపీ కూటమిలో బీజేపీ చేరింది. మరి బీజేపీతో జగన్ బంధం ఎలా ఉంది అంటే రాజకీయాలలో ఈ బంధాలకు ఎవరూ కొలమానాలు చెప్పలేరు. అది అవసరాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి.
ఇక బీజేపీలో సైతం చూస్తే జగన్ కి ప్రధాని మోడీతో అలాగే అమిత్ షాతోనే ఎక్కువగా భేటీలు ఉండేవి. మిగిలిన వారితో పూర్తిగా కర్టెసీ కాల్ గా ఉండేవి. ఇక ఆ ఇద్దరు పెద్దలతో స్నేహ బంధం అంటే అది చెప్పుకునేలా ఉండేంత బలమైనది కాదేమో అన్న చర్చ ఉంది. ఇలా ఏతా వాతా చూస్తే బీజేపీలో వైసీపీకి జగన్ కి పెద్దగా స్నేహితులు అనదగిన వారు ఎవరూ లేరనే అంటున్నారు.
అయితే లేటెస్ట్ గా చూస్తే జగన్ కి కూడా మిత్రులు ఉన్నారని అంటున్నారు. అది సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణా నుంచే అని అంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుట్టిన రోజున జగన్ ఆయనకు ట్వీట్ చేస్తూ మిత్రుడు అని సంబోధించారు. అలా ఆయనకు గ్రీట్ చేశారు.
నిజానికి జగన్ తక్కువగా ఇలాంటి గ్రీట్స్ చేస్తూ ఉంటారు. ఆయన రాజకీయంగా ప్రత్యర్ధి అయినా చంద్రబాబు బర్త్ డే కి మాత్రమే గ్రీట్ చేస్తారు. ఇంక ఎవరికీ గ్రీట్ చేసినట్లుగా కనిపించదు. ఇపుడు చూస్తే కిషన్ రెడ్డి బర్త్ డే వేళ గ్రీట్ చేశారు అంటే జగన్ కి కిషన్ రెడ్డి బీజేపీలో మంచి మిత్రుడు అని అంటున్నారు అంతా.
అయితే రాజకీయంగా కర్టెసీ పరంగా కూడా ఈ గ్రీట్ చేసి ఉంటారు అని అంటున్న వారూ ఉన్నారు. అయితే గతంలో ఎపుడూ ఈ తరహా గ్రీట్స్ ఆయన నుంచి లేవు కాబట్టి పైగా జగన్ ఇలాంటి ఫక్తు రొటీన్ ఫార్మాలిటీస్ కి ఎపుడూ దూరం పాటిస్తారు కాబట్టి ఆయన చేసిన గ్రీట్ మీద చర్చ సాగుతోంది.
ఏది ఏమైనా చూస్తే కనుక కిషన్ రెడ్డి తెలుగు నాట అందరి వారుగా రాజకీయంగా పేరు తెచ్చుకున్నారు ఆయనకు పెద్దగా రాజకీయ ప్రత్యర్థులు కూడా లేరు. జగన్ సీఎం గా ఉన్నపుడు ఆయన ఇంటికి లంచ్ కి వచ్చిన కిషన్ రెడ్డి ఇటీవలే చంద్రబాబు ఇంటికి కూడా వచ్చి లంచ్ చేశారు. అదే సమయంలో ఆయన అందరితోనూ బాగుంటారు. కేంద్ర నాయకత్వానికి కావాల్సిన వారుగా ఉంటారు. అలా ఆయన జగన్ కి కూడా రాజకీయంగా మంచి మిత్రుడు అని అంటున్నారు.
