Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి భారీ కౌంటర్

గడిచిన కొద్దిరోజులుగా కేంద్ర సర్కారు మీదా.. మోడీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు.. ఆరోపణలు సంధించటం తెలిసిందే.

By:  Garuda Media   |   8 Jun 2026 9:53 AM IST
సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి భారీ కౌంటర్
X

గడిచిన కొద్దిరోజులుగా కేంద్ర సర్కారు మీదా.. మోడీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు.. ఆరోపణలు సంధించటం తెలిసిందే. తెలంగాణ ప్రాజెక్టులకు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడటమే కాదు.. కేంద్రమంత్రులు బండి సంజయ్.. కిషన్ రెడ్డిలు తమాషాలు చేస్తున్నారని.. పని చేయటం చేతకాకపోతే దిగిపోవాలంటూ మండిపడటం తెలిసిందే. అంతేకాదు.. తానేమీ అల్లాటప్పాగా రాలేదని.. కష్టపడి తొక్కుకుంటూ వచ్చినట్లుగా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని సీఎం రేవంత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘అవసరమైతే ఫాంహౌస్ లో కేడీతో అయినా.. ఢిల్లీలో మోడీతో అయినా కోట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. పన్నెండేళ్లు అయ్యింది. ముందు మోడీని గద్దె దిగమనండి. రాహుల్ గాంధీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయప్రాజెక్టు చేయిస్తా. మెట్రో విస్తరణ.. ట్రిఫుల్ ఆర్ కు నిదులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను డెవలప్ చేస్తా’’ అంటూ మండిపడ్డారు. ధాన్యం సేకరణ విషయంలోనూ కేంద్రం.. కిషన్ రెడ్డి తీరును సీఎం తప్పు పట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి రియాక్టు అయ్యారు. ఇటీవల కాలంలో ఆయన ఎప్పుడూ లేనంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. ముఖ్యమంత్రికి భారీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రాజకీయంగా నిరాశ.. నిస్ప్రహల్లో ఉన్నట్లుగా పేర్కొన్న కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నన్ను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదు. నాకు రేవంత్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈ జన్మలో రాహుల్ ప్రధాని కాలేడు. కాంగ్రెస్ ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారు’’ అంటూ మండిపడ్డారు.

మా ఇంటి ముందుకు వచ్చి ధర్నాలు చేస్తామని అంటున్నారు.. దేనికైనా సిద్ధం. గత ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడే భాష ఒకేలా ఉన్నాయన్న కిషన్ రెడ్డి.. ‘‘కేసీఆర్ వాడిన భాషనే ఇప్పటి సీఎం రేవంత్ వాడుతున్నారు. ఇలాగే మాట్లాడి ప్రజాగ్రహాన్ని చవి చూసిన కేసీఆర్ ను ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేశారు. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న రేవంత్ కూడా తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల వేళ అబద్ధపు హామీలు ఇచ్చి.. అసమర్థ పాలనతో అడుగడుగునా నమ్మకద్రోహం చేస్తున్నారంటూ మండిపడిన ఆయన.. ప్రజలు ఎదుర్కొంటున్ సమస్యల్ని గాలికి వదిలేసి.. గాలి మేడలు కట్టేస్తున్నారన్నారు. బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీలకు విమర్శించటమే తప్పించి.. పని చేసే అలవాటు లేదన్నారు. తాను తెలంగాణకు ఏం చేశానో రేవంత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఆయన.. సీఎం తాటాకు చప్పుళ్లకు తాను బెదరనని స్పష్టం చేశారు.

సమకాలీన రాజకీయాల్లో నోటికి వచ్చినట్లుగా తిట్టిపోయటం.. అవసరమైతే మర్యాదల్ని పక్కన పెట్టేసి.. విరుచుకుపడటం నేతలకు ఒక అలవాటుగా మారింది. ఇలాంటి సమయంలోనూ ఘాటు విమర్శలకు కిషన్ రెడ్డి దూరంగా ఉంటారన్న పేరుంది. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. ఆ తర్వాత ఆయన అంతలా మాట్లాడింది లేదు. అందుకు భిన్నంగా తాజాగా సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. కిషన్ రెడ్డి తన తీరును మార్చుకున్నట్లుగా కనిపించక మానదు. మొత్తానికి కిషన్ రెడ్డి మాట తీరును మార్చటంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.