Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డి ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి

బీజేపీకి చెందిన కిషన్ రెడ్డి పెద్దగా రాజకీయ విమర్శల జోలికి పోరు. అంతే కాదు ఆయన రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు కూడా చాలా తక్కువగా చేస్తారు.

By:  Tupaki Desk   |   2 July 2025 9:00 AM IST
కిషన్ రెడ్డి ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
X

బీజేపీకి చెందిన కిషన్ రెడ్డి పెద్దగా రాజకీయ విమర్శల జోలికి పోరు. అంతే కాదు ఆయన రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు కూడా చాలా తక్కువగా చేస్తారు. ఆయన బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున కేంద్ర మంత్రి అయ్యారు. కేబినెట్ ర్యాంక్ తో కీలకమైన శాఖలను చూస్తున్నారు. అలాంటి కిషన్ రెడ్డి తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టార్గెట్ అయ్యరా అన్న చర్చ సాగుతోంది.

తెలంగాణాలో దాదాపు అచేతానవస్థలో ఉన్న బీఆర్ఎస్ ని లేపడానికి బీజేపీ చూస్తోంది అని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ని రాజకీయంగా బతికించడం కోసమే బీజేపీ పనిచేస్తోంది అని ఆయన అంటున్నారు. కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతీ మాటకు స్క్రిప్ట్ బీఆర్ ఎస్ ఆఫీసు నుంచి వస్తోంది అని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఇది నేను అధికారికంగానే చెబుతున్నాను అని ఆయన అనడం విశేషం.

తెలంగాణా రాష్ట్ర ప్రయోజనల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ ఎస్ బీజేపీ కలసి పనిచేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుని ముందుకు తీసుకుని పోయేందుకు కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతూంటే తాను కూడా కీలకమైన కేంద్ర మంత్రిగా ఉండి కేంద్ర పెద్దల వద్ద పలుకుబడి ఉండి కూడా కిషన్ రెడ్డి తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం మీద పెద్దగా స్పందించకపోవడమేంటి అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

తాము కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తూంటే తమ కంటే ఒక రోజు ముందే ఆ కేంద్ర మంత్రులను కిషన్ రెడ్డి కలిసి మాట్లాడుతారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ సీక్రెట్ మీటింగులు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణా పట్ల నిబద్ధత ఉంటే కనుక తమతో కలసి వచ్చి కేంద్ర మంత్రులకు తెలంగాణా గురించి సమస్యలు చెప్పవచ్చు కదా అని రేవంత్ రెడ్డి అంటున్నారు.

బీఆర్ఎస్ ని తెలంగాణాలో లేపాలని చూడడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్దిని పొందాలని చూస్తోంది అని అన్నారు. అయితే 2023 ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ కి 2024 లోక్ సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు అయ్యాయని, 2025లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధులే దొరకలేదని సెటైర్లు వేశారు. అబద్ధాలనే ప్రచారం చేస్తూ వస్తున్న బీఆర్ఎస్ కి బీజేపీ తెర వెనక సాయం చేస్తే రాజకీయంగా ఏమో కానీ తెలంగాణా నష్టపోతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి తమతో కలసి రావాలని ఆయన కోరారు.

అయితే కిషన్ రెడ్డి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ లను కలిపి విమర్శిస్తున్నారు. ఆ రెండు పార్టీలూ తమకు రాజకీయ ప్రత్యర్ధులే అంటున్నారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒక్కటే అని కాంగ్రెస్ అంటోంది. మరి ఈ రాజకీయ వ్యూహాలు ఏంటో ఈ విమర్శల వెనక నిజాలు ఏమిటో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కిషన్ రెడ్డికి బీఅర్ఎస్ నుంచే స్క్రిప్ట్ వస్తుదన్న ఆరోపణలు మాత్రం వైరల్ అవుతున్నాయి.