Begin typing your search above and press return to search.

బిల్డర్ ను ఏమార్చి.. హనీట్రాప్‌ కేసులో ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్!

గుజరాత్‌లో సంచలనం సృష్టించిన హనీట్రాప్‌ కేసులో ప్రధాన నిందితురాలైన ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కీర్తి పటేల్‌ను సూరత్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   19 Jun 2025 9:56 AM IST
బిల్డర్ ను ఏమార్చి..  హనీట్రాప్‌ కేసులో  ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్!
X

గుజరాత్‌లో సంచలనం సృష్టించిన హనీట్రాప్‌ కేసులో ప్రధాన నిందితురాలైన ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కీర్తి పటేల్‌ను సూరత్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దాదాపు 13 లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ఈ యువతి గత పది నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండటం గమనార్హం.

- కేసు వివరాలు:

పోలీసుల కథనం ప్రకారం.., సూరత్‌కు చెందిన కీర్తి పటేల్ ఒక ప్రముఖ బిల్డర్‌ను హనీట్రాప్‌ చేసి, అతడిని బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేయాలని పథకం వేసింది. బాధితుడైన బిల్డర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా, కీర్తి పటేల్ మాత్రం పారిపోయింది. 2023 జూన్ 2న సూరత్ కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

-పోలీసుల వేట.. ఎలా పట్టుబడింది?

కీర్తి పటేల్‌ను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అత్యాధునిక సాంకేతికత సహాయంతో ఆమెను ట్రేస్ చేశారు. ఆమె పదే పదే సిమ్‌కార్డులు, ఫోన్ ఐపీ అడ్రస్‌లు మారుస్తూ, గుజరాత్‌లోని వివిధ నగరాలకు మకాం మార్చింది. దీంతో ఆమెను పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. అయినప్పటికీ పోలీసులు నిఘా పెట్టి, చివరకు అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను సూరత్‌కు తరలించారు.

ఈ అరెస్టు గురించి డీసీపీ అలోక్ కుమార్ మాట్లాడుతూ కీర్తి పటేల్‌పై భూకబ్జా, దోపిడీ కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. తమ సాంకేతిక బృందాలు ఆమె సాంకేతిక కదలికలను ఛేదించి పట్టుకున్నాయని ఆయన వివరించారు.

- సోషల్ మీడియాలో చర్చ:

ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇంతటి మోసానికి పాల్పడటం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. నెటిజన్లను ఈ ఘటన ఆశ్చర్యపరిచింది. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.