Begin typing your search above and press return to search.

రాజ్యసభ రేసులోకి నల్లారి ?

ఉమ్మడి ఏపీకి చివరి సీఎం గా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. ఏకంగా మూడున్నరేళ్ళ పాటు ముఖ్యమంత్రిత్వం వహించారు.

By:  Satya P   |   20 Feb 2026 7:00 AM IST
రాజ్యసభ రేసులోకి నల్లారి ?
X

ఉమ్మడి ఏపీకి చివరి సీఎం గా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. ఏకంగా మూడున్నరేళ్ళ పాటు ముఖ్యమంత్రిత్వం వహించారు. ఆయనే ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం అయితే చిన్న వయసులో అయ్యారు. కానీ ఆ తరువాతనే ఆయన రాజకీయం సరిగ్గా సాగడంలేదు అని అంటున్నారు. 2014 నుంచి చూస్తే ఇప్పటిదాకా పుష్కర కాలంగా నల్లారి వారు చట్ట సభలలోకి అడుగుపెట్టలేకపోయారు. ఆయన బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ఇలా మారుతూ వచ్చినా కూడా రాజకీయ సుడి మాత్రం తిరగడం లేదు. లేకపోతే 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి వీర విహారం చేసిన స్థితిలో సైతం ఆయన లోక్ సభకు ఎంపీ కాలేకపోయారు. రాజంపేట నుంచి ఆయన కనుక గెలిచి ఉంటే ఈపాటికి కేంద్ర మంత్రిగా నిక్షేపంగా కీలక స్థానంలో ఉండేవారు అని అనుచరులు ఆవేదేన చెందుతూంటారు.

కేంద్ర రాజకీయాల్లోనే :

ఇదిలా ఉంటే నల్లారి వారి చూపు కేంద్ర రాజకీయాల మీదనే ఉంది అని అంటున్నారు. ఉమ్మడి ఏపీకి సీఎం గా చేసిన ఆయనకు విభజన ఏపీలో తగిన హోదాతో పదవి అయిఏ ఉండదనే చెప్పాలి. అందుకే ఆయన అయితే రాజ్యసభకు వెళ్ళాలని లేదా రాజ్ భవన్ వైపు అయినా చూడాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. 2024 ఏడాదిలో ఏపీ నుంచి రాజ్యసభకు నాలుగు సీట్లు ఖాళీ అయ్యాయి. అందులో రెండు బీజేపీకి దక్కాయి. ఒకటి బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య మళ్ళీ తానే రెన్యూల్ అయి వెళ్లారు. రెండవది చూస్తే గోదావరి జిల్లాలకు చెందిన ఒక సీనియర్ బీజేపీ నేతకు దక్కింది. ఈ సీటు కోసం అప్పట్లో నల్లారి వారు ప్రయత్నం చేశారు అని కూడా ప్రచారం సాగింది.

ఈసారి గురి తప్పదా :

ఇక ఈసారి మరో నాలుగు రాజ్యసభ సీట్లు ఏపీ కోటాలో ఖాళీ అవుతున్నాయి. అందులో బీజేపీ వాటాగా ఒక సీటు లభిస్తోంది. ఈ సీటు కోసం పోటీ జాతీయ స్థాయి నుంచి కూడా ఉంది. అయితే ముఖ్యమంత్రిగా పనిచేసిన వారుగా రాయలసీమలో ప్రధానమైన సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా ఉన్న నల్లారి కి ఈ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. రాయలసీమ అంటే వైసీపీకి బలం ఉన్న ప్రాంతంగా ఉంది. అక్కడ రెడ్లను ఆకరిషించే క్రమంలో బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో పేరున్న నేత రాజకీయ కుటుంబానికి చెందిన వారు మాజీ సీఎం అయిన నల్లారిని పెద్దల సభకు పంపడం ద్వారా ఉభయ తారకంగా ఉంటుందని ఒక ఆలోచన అయితే ఉందిట.

గట్టి పోటీయే కానీ :

ఇక చూస్తే రాజ్యసభ రేసులో బీజేపీ నుంచి గట్టి పోటీయే ఉంది అని అంటున్నారు. అయితే ఈ పోటీలో కూడా ఏపీకి చెందిన వారికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. జాతీయ స్థాయిలో ఎవరినో దిగుమతి చేయడం వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. కానీ కమలనాధుల ఆలోచనలు ఎపుడూ ఆశ్చర్యకరంగా ఉంటాయి. అనూహ్యమైన అభ్యర్ధిని వారు బరిలోకి దింపుతారు. కానీ నల్లారి వారు మాత్రం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వడం మీద ఏపీలో టీడీపీ కూటమి పెద్దలకు సైతం అభ్యంతరాలు లేవని అంటున్నారు. అయితే బీజేపీ కేంద్ర పెద్దల ఆలోచనలే తెలియాల్సి ఉంది అని అంటున్నారు. బీజేపీలో మొదటి నుంచి ఉంటూ ఆర్ ఎస్ ఎస్ నేపధ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారా లేక రాజకీయ ప్రయోజనాలను చూసుకుని సీమలో కీలక నేతగా ఉన్న నల్లారిని పెద్దల సభకు పంపుతారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.