'కిరణ్ సార్'కి పాలిటిక్స్ కలిసి రావట్లేదే!
ఆయనే ఉమ్మడి ఏపీ చివరి సీఎం. అయితే..రాష్ట్ర విభజనను తీవ్రంగా విభేదించిన నల్లారి.. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు.
By: Tupaki Desk | 30 Jun 2025 12:09 PMఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి. గత పదేళ్లుగా ఆయనకు రాజకీయాలు కలిసి రావడం లేదా? ఏది పట్టుకున్నా.. ఆయనను అదృష్టం వరించడం లేదా? తాజాగా కూడా ఏపీ బీజేపీ పగ్గాలు గట్టిగా పట్టుకునే అవకాశం వచ్చిందని భావించినప్పటికీ.. చివరి నిముషంలో కీలక కారణంతో అవి తప్పిపోయాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి ఉమ్మడి ఏపీలో స్పీకర్‌గా పనిచేసిన కిరణ్‌కుమార్.. అందరికీ తెలిసిన నాయకుడే. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత.. రాష్ట్రంలో రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. ఆయనపై పెరిగిన అసంతృప్తి.. తదుపరి కారణాలతో నల్లారిని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఎంచుకుంది. ఆయనే ఉమ్మడి ఏపీ చివరి సీఎం. అయితే..రాష్ట్ర విభజనను తీవ్రంగా విభేదించిన నల్లారి.. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన `సమైక్య ఆంధ్ర` పేరుతో సొంత పార్టీని పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన పోటీలో లేకుండా.. పలువురిని పోటీలో పెట్టారు. కానీ, ఎవరూ కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. దీంతో సదరు పార్టీ మూసేశారు. ఆ తర్వాత.. కిరణ్.. సైలెంట్ అయ్యారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత.. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆయనకు రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, ఎలాంటి ఊసూ కనిపించలేదు.
దీంతో మళ్లీ యూటర్న్ తీసుకున్న కిరణ్.. బీజేపీలో చేరారు. ఎట్టకేలకు గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట(కడప జిల్లా. కానీ, కిరణ్‌ది చిత్తూరు జిల్లా) నుంచి పోటీ చేసేందుకు చాన్స్ చిక్కింది. కానీ.. ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక, అప్పటి నుంచి పెద్దల సభపై ఆశ పెట్టుకున్నా.. ఫలించలేదు. ఇంతలో ఏపీలో బీజేపీ చీఫ్ పోస్టు ఖాళీ అవుతోందని తెలియగానే.. కిరణ్ తన ప్రయత్నం తాను చేశారు. అయితే.. ఆర్ ఎస్ ఎస్ వాదాన్ని వంటబట్టించుకున్నవారికే.. ఇప్పుడు రాష్ట్రాల్లో పదవులు ఇస్తున్న నేపథ్యంలో చివరి నిముషంలో కిరణ్‌కు అదృష్టం దూరమైందని అంటున్నారు.