రాజకీయాలకు టాటా.. కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయమిదేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 27 July 2025 10:00 PM ISTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2014లో రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి సారథ్యం వహించిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ సక్సెస్ కాకపోవడంతో దాదాపు ఐదేళ్లు రాజకీయ విరామం తీసుకున్నారు. 2018 చివర్లో కాంగ్రెస్ లో చేరినా అక్కడ ఆయన సెకెండ్ ఇన్నింగ్స్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో గత ఎన్నికల ముందు బీజేపీలో చేరారు.
విశ్రాంతి కాదు విరామమే..?
గత ఎన్నికలకు ముందు కమలం కండువా కప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా చూపినా, రాజంపేటలో మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి గట్టెక్కలేకపోయారు. తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డిపై 77 వేల తేడాతో ఓడిపోయారు. రాజంపేట తన సొంత ప్రాంతం అయినప్పటికీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అటువైపు చూడలేదు. దాదాపు 14 నెలలుగా ఆయన రాజంపేట నియోజకవర్గంలోని తన సొంత గ్రామానికి సైతం రాలేదని చెబుతున్నారు. ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనే గడుపుతున్నట్లు సమాచారం. దాదాపు పదేళ్లు విశ్రాంతి రావడంతో ఇక రాజకీయాలు చేయడం కన్నా విరామం తీసుకోవడమే బెటర్ అన్న ఆలోచనకు వచ్చారని అంటున్నారు.
రాజ్యసభ సభ్యత్వం కోసం..
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత బీజేపీ ద్వారా రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఉండటంతో బీజేపీ పెద్దలు తనను రాజ్యసభకు ప్రమోట్ చేస్తారని కొద్దికాలం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేశారన్న ప్రచారం జరిగింది. ఏపీ నుంచి కాకపోయినా పక్క రాష్ట్రం నుంచి అయినా అవకాశం వస్తుందన్న ఆలోచనలో ఆయన ఉండేవారని అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగాలంటే తనలాంటి సీనియర్ల సేవలు అవసరమని భావించిన కిరణ్ కుమార్ రెడ్డి తనకు పదవి ఉంటే ప్రజల్లోకి వెళ్లడానికి బాగుంటుందని పార్టీలో ప్రతిపాదించారని చెబుతున్నారు. అయితే వైసీపీ నుంచి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకుని తిరిగి వారికే అవకాశం ఇచ్చిన బీజేపీ.. కిరణ్ విషయంలో ఎటూ తేల్చలేదని అంటున్నారు. దీంతో నిరాశ చెందిన ఆయన రాష్ట్రానికి కూడా రావడం మానేశారని అంటున్నారు.
బీజేపీ అధ్యక్ష పదవిపైనా ప్రచారం
కిరణ్ కుమార్ రెడ్డి సీనియార్టీ, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వల్ల ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడతారని కొద్దిరోజులు ప్రచారం జరిగింది. పురందేశ్వరి స్థానంలో కిరణ్ కు అవకాశం ఇస్తారని, ఆయన సామాజికవర్గాన్ని ఆకర్షించడంతోపాటు రాష్ట్రంలో బలపడేందుకు ఉపయోగపడుతుందని కిరణ్ అభ్యర్థిత్వంపై కమలం పార్టీ ఆసక్తిగా ఉందని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే బీజేపీ పెద్దలు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికే అవకాశం ఇవ్వడంతో కిరణ్ కుమార్ రెడ్డి పేరు వెనక్కి వెళ్లింది. ఇలా బీజేపీలో తన ప్రయాణం సాఫీగా లేకపోవడం, క్షేత్రస్థాయి రాజకీయాలకు గ్యాప్ రావడంతో రాజకీయాల నుంచి విరమించుకోవడమే మంచిదన్న నిర్ణయానికి ఆయన వచ్చారని అంటున్నారు. అయితే ఆయన రాజకీయాల నుంచి విశ్రమించాలన్న ఆలోచనలో ఉన్నారన్న ప్రచారంపై స్నేహితులు, అనుచరులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నేతలు 75, 80 ఏళ్ల వయసులోనూ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే 64 ఏళ్ల వయసులోనే కిరణ్ కుమార్ రెడ్డి విరమించుకోవాలని నిర్ణయించుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
