Begin typing your search above and press return to search.

నల్లారి వారికి బీజేపీ ఏ పదవి ఇస్తుందో ?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తండ్రి కాలం నుంచి కాంగ్రెస్ ని నమ్ముకున్న కుటుంబం. అదే కాంగ్రెస్ ఆయనను ఎమ్మెల్యేగా చేసింది, చీఫ్ విప్ గా చేసింది

By:  Tupaki Desk   |   16 July 2025 12:00 AM IST
నల్లారి వారికి బీజేపీ ఏ పదవి ఇస్తుందో ?
X

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తండ్రి కాలం నుంచి కాంగ్రెస్ ని నమ్ముకున్న కుటుంబం. అదే కాంగ్రెస్ ఆయనను ఎమ్మెల్యేగా చేసింది, చీఫ్ విప్ గా చేసింది. స్పీకర్ గా చేసి చీఫ్ మినిస్టర్ కుర్చీలోనూ కూర్చోబెట్టింది. మంత్రి పదవి తనకు దక్కలేదని ఒక దశలో ఆవేదన చెందిన నల్లారిని ఏకంగా చీఫ్ మినిస్టర్ సీటే మీది అని చెప్పి ఆదరించింది కాంగ్రెస్. ఉమ్మడి ఏపీకి అందునా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రానికి మూడున్నరేళ్ళ పాటు సీఎం గా చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు

నిజంగా జాక్ పాట్ సీఎం అని ఎందుకు అన్నారో కానీ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం చాలా లక్కీయెస్ట్ పొలిటీషియన్ అని అంతా ఈ రోజుకీ చెబుతారు. అయితే అంతగా ఆదరించిన కాంగ్రెస్ ని ఆయన విభేదించారు. ఉమ్మడి ఏపీని రెండుగా చేసిందని ఆగ్రహించి ఆ పార్టీకి రాజీనామా చేసి ఏపీలో సమైక్యాంధ్రా అని ఒక కొత్త పార్టీని ప్రారంభించారు కానీ ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేదు. అఫ్ కోర్స్ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ కూడా చేయలేదనుకోండి.

విభజన ఏపీలో ఆయన మరో రాజకీయ దారి లేక మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. అయినా కాంగ్రెస్ దేశంలోనే ఎత్తిగిల్లలేదు. కిరణ్ కుమార్ రెడ్డికీ ఏమీ దక్కలేదు. ఇక అలా లాభం లేదనుకుని బీజేపీలోకి ఆయన చేరారు. కేంద్రంలో దివ్యంగా వెలిగిపోతున్న బీజేపీలో తనకు ఎంపీగా కేంద్ర మంత్రిగా లేక తన సీనియారిటీకి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా అయినా పదవి వస్తుందని అనుకున్నారు.

అయితే ఏడాది పైగా పూర్తి కావస్తోంది కానీ బీజేపీ పెద్దలు అయితే ఏ పదవీ ఇవ్వలేదు. 2024లో రాజంపేట లోక్ సభ టికెట్ ఇస్తే ఏపీలో కూటమి ప్రభంజనం ఉండి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఓడారు దాంతో కేంద్ర పెద్దలకు ఆయన సత్తా మీద ఏమైనా డౌట్లు వచ్చాయేమో అన్నది ఒక చర్చగా ఉంది. అంతే కాదు గత ఏడాది కాలంగా ఆయన పార్టీ కోసం కృషి చేసింది పెద్దగా ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారుట. అయితే ఉమ్మడి ఏపీకి చీఫ్ మినిస్టర్ గా చేసిన తనకు పదవి ఇస్తే చేస్తారు కానీ ఏమీ కాకుండా ఏమి చేస్తారు అన్నది ఆయన అభిమానుల మాటగా ఉందిట.

ఇవన్నీ పక్కన పెడితే బీజేపీలో వరసబెట్టి పదవులు పంచుకుంటూ పోతున్నారు. రాష్ట్రపతి నామినేట్ చేసే రాజ్యసభ సభ్యుల కోటా కూడా తాజాగా పూర్తి అయింది. నలుగురుకి అవకాశం అలా దక్కింది. అందులో కిరణ్ పేరు లేదు. ఇక మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఏపీ నుంచి మిత్రపక్షం టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజుకు అవకాశం లభించింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన లేదు

రెండు నెలల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి అయితే తనకు పెద్ద పదవి ఒకటి లభించబోతోంది అని తన అనుచరులతో చెప్పి ఉన్నారని అంటున్నారు. మరి ఆ పెద్ద పదవి గవర్నర్ అయితే కావచ్చు అని అనుకున్నారు. ఇపుడు ఆ చాన్సూ లేదని అంటున్నారు. రాజ్యసభ ఎంపీగా చేసి కేంద్ర మంత్రిగా చేస్తారనుకున్నా అది కూడా ఏమీ అయ్యేటట్లు లేదుట.

మొత్తం మీద బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి జస్ట్ ఒక సీనియర్ నాయకుడిగా మిగిలిపోయారని అంటున్నారు. దాంతో నా సంగతి ఏమిటి సారూ అని అడిగేందుకు ఆయన ఢిల్లీ ప్రయాణం కడుతున్నారని అంటున్నారు. కేంద్ర పెద్దలను కలసి తన మదిలోని మాటని వారి చెవిన వేస్తే అయినా రానున్న కాలానికి కలసివచ్చే పదవి ఏదైనా నడచుకుని వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారుట.

అందుకే ఆయన పోయి రావలె హస్తినకు అని అంటున్నారుట. మరి ఆయన కేంద్ర పెద్దలతో భేటీ అయితే ఆయనకు ఇచ్చే పదవి విషయంలో ఏదైనా స్పష్టత వస్తుందేమో అని అంటున్నారు. జాతీయ బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఖాళీగా ఉంది. అది అయినా ఇస్తారా అన్నది కూడా ఉందిట. ఇక ఢిల్లీ టూర్ లో క్లారిటీ పక్కాగా వస్తే ఆ మీదట కిరణ్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి ఏదో ఒక విషయం తేల్చుకునేందుకే ఢిల్లా బాట పట్టనున్నట్లుగా సమాచారం. మరి నల్లారి వారి ఆశలు తీరేనా అందలం దక్కేనా అంటే వెయిట్ అండ్ సీ.