మాజీ సీఎంకు ఏపీ బీజేపీ పగ్గాలు.. నిజమేనా?
ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవిని కొత్తవారికి అప్పగించేందుకు రంగం రెడీ అయింది.
By: Tupaki Desk | 29 Jun 2025 4:00 PM ISTఏపీలో బీజేపీ అధ్యక్ష పదవిని కొత్తవారికి అప్పగించేందుకు రంగం రెడీ అయింది. గత ఏడాది ఎన్నికలకు ముందు ఏపీ బీజేపీ సారథిగా పగ్గాలు చేపట్టిన మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి కట్టేందుకు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బాగానే కృషి చేశారని చెప్పాలి. అయితే.. రెండేళ్లకు మాత్రమే పరిమితం అయ్యే ఈ పదవిని తాజాగా మార్పు చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. మొత్తంగా 9 రాష్ట్రాల్లో బీజేపీ చీఫ్‌లను మార్చను న్నారు. వీరితోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా మార్చేయనున్నారు.
వాస్తవానికి ఈ ఏడాది జనవరితోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు సహా.. 9 రాష్ట్రాల అధ్యక్షులను కూడా బీజేపీ మార్చాల్సి ఉంది. అయితే.. పార్లమెంటు సమావేశాలు, ఇంతలోనే పహిల్గాం ఉగ్రదాడి సహా పలు సమస్యలు రావడంతో నాయకులు ఈ విషయా న్ని పక్కన పెట్టారు. తాజాగా బీహార్ సహా వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికితోడు.. ఏపీలోనూ వచ్చే ఏడాది స్థానిక ఎన్నికలకుముహూర్తం పెట్టనున్నారు. ఈ క్రమంలో పార్టీ పరంగా మార్పు ఖాయమని కొన్నాళ్లుగా సూచనలు అందాయి. ఈ క్రమంలో కమల నాథులు క్యూ కట్టారు.
కీలకమైన బీజేపీ ఏపీ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు బీసీ, ఓసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు లైన్‌లో ఉన్నారు. వీరిలో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పేరు జోరుగా వినిపిస్తోంది. ఆయన కాంగ్రెస్‌ను వీడిన తర్వాత.. పలు పార్టీల్లోకి వెళ్లారు. చివరకు రెండేళ్ల కిందట బీజేపీ కండువా కప్పుకొన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పార్లమెంటుకుపోటీ చేశారు. కూటమి ప్రభావంతో చాలా మంది అభ్యర్థులు విజయం దక్కించుకున్నా కిరణ్‌కుమార్‌రెడ్డి పరాజయం పాలయ్యారు.
ఈ క్రమంలో ఆయన కొన్నాళ్లుగా తన స్థాయికి తగిన పదవి కోసం వేచి చూస్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ పదవి ఖాళీ అవుతుండడంతో ఆయనను నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. దీనికి మరో కారణం కూడా వినిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయడం ద్వారా వైసీపీని టార్గెట్ చేయొచ్చని .. బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా వైసీపీకి అనుకూలంగా ఉంది. ఈ క్రమంలో తటస్థంగా కూడా చాలా మంది ఉన్నారు. వీరిని ఆకర్షించేందుకు కిరణ్ కుమార్ రాజకీయం పనిచేస్తుందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే కిరణ్‌కుమార్‌కు ఏపీ బీజేపీపగ్గాలు అప్పగించే అవకాశం ఉందని మెజారిటీ నాయకులు భావిస్తున్నారు. వచ్చే నెల 1న సాయంత్రానికి కానీ.. దీనిపై క్లారిటీ వచ్చేఅవకాశం లేదు.
