Begin typing your search above and press return to search.

కిమ్‌.. 'వార్' విషెస్‌.. ప్ర‌పంచానికి హాట్ టాపిక్‌

ఇప్పుడు కూడా అంతే! ప్ర‌పంచం మొత్తం నూత‌న సంవ‌త్స‌ర వేడుకల్లో మునిగిపోయిన నేప‌థ్యంలో కిమ్ ఒక్క‌సారిగా మాట‌ల బాంబు పేల్చారు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 3:30 AM GMT
కిమ్‌.. వార్ విషెస్‌.. ప్ర‌పంచానికి హాట్ టాపిక్‌
X

కిమ్.. ఈ పేరు అన‌గానే వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేరు ఉత్త‌ర‌కొరియా నియంత పాల‌కుడు కిమ్ జోంగ్ ఉన్‌. ఆయ‌న స్ట‌యిలే వేరు. ఆయ‌న వ్య‌వ‌హార‌మే వేరు. ఆయ‌న ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా ఆ ఎఫెక్టే వేరుగా ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే! ప్ర‌పంచం మొత్తం నూత‌న సంవ‌త్స‌ర వేడుకల్లో మునిగిపోయిన నేప‌థ్యంలో కిమ్ ఒక్క‌సారిగా మాట‌ల బాంబు పేల్చారు. ప్ర‌పంచానికి వార్ విషెస్ చెప్పారు.

వాస్తవానికి కొత్త ఏడాది సందర్భంగా ఎవరైనా శుభాకాంక్షలు తెలపడమో, శుభవార్తలు చెప్పడమో చేస్తారు. కానీ.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం యుద్ధం అనివార్యమంటూ హెచ్చరికలు జారీ చేశారు. అదేస‌మ‌యంలో 2024, కొత్త ఏడాదిలో తన తదుపరి లక్ష్యాలను ప్రకటించారు.

అమెరికా, దక్షిణ కొరియా కలిసి సైనిక కార్యకలాపాలను విస్తరిస్తున్న తరుణంలో.. వాటిని ఎదుర్కోవడం కోసం యుద్ధం అనివార్య‌మ‌ని తెగేసి చెప్పాడు. ఈ మేరకు ఉత్తర కొరియా అఫిషియ‌ల్ మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. ‘2023లో ప్రయోగించిన తొలి సైనిక నిఘా శాటిలైట్ విజయవంతం అయ్యింది. 2024లో మరో మూడు అదనపు సైనిక నిఘా శాటిలైట్స్‌ని పరీక్షిస్తాం’’ అని కిమ్ జోంగ్ ఉన్ చెప్పార‌ట‌.

అదేవిధంగా మరిన్ని అణ్వస్త్రాలనూ సమకూర్చుకుంటామని, మానవ రహిత ఆయుధాలనూ ప్రవేశపెడతా మని ఆయన వెల్లడించారు. అమెరికాతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సవాళ్ల నేపథ్యంలో.. తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకుంటామని కిమ్‌ పునరుద్ఘాటించాడు.

కొత్త ఆయుధాల ప్రయోగ పరీక్షల పరంపర కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ప్ర‌పంచం మొత్తం .. కొత్త సంవ‌త్స‌రంలో అయినా శాంతి స్తాప‌న దిశ‌గా అడుగులు వేయాల‌ని త‌ల‌పోస్తుంటే.. కిమ్ మాత్రం యుద్ధం దిశ‌గా అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.