Begin typing your search above and press return to search.

కళాకు ఇదే గోల్డెన్ చాన్స్ ?

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన కళా వెంకటరావు 2024 ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ చేయాలని అనుకున్నారు.

By:  Satya P   |   1 March 2026 9:58 AM IST
కళాకు ఇదే గోల్డెన్ చాన్స్ ?
X

ఉత్తరాంధ్రా జిల్లాలలో సీనియర్ మోస్ట్ లీడర్ గా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో మూడు తరాలకు చెందిన నాయకులతో అత్యంత సన్నిహితంగా ఉంటూ పనిచేస్తున్నారు. వారి మన్ననలు చూరగొంటున్నారు కూడా. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన కళా వెంకట్రావు అన్న ఎన్టీఆర్ ప్రోత్సాహంతో శ్రీకాకుళం జిల్లా ఉణుకూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ మీదట ఆయన అనేక పర్యాయాలు అదే ఉణుకూరు నుంచి గెలిచి అసెంబ్లీలో తన గళం వినిపించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కీలకమైన హోం శాఖతో సహా అనేక శాఖలను నిర్వహించిన ఘనత కూడా కళా వెంకట్రావు కే దక్కుతుంది. అదే విధంగా ఆయన చంద్రబాబుకు కూడా ఎంతో ఇష్టుడిగా మెలుగుతూ వచ్చారు. బాబు హయాంలోనే కళాకు టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ పదవి దక్కింది. అలాగే 2017 నుంచి 2019 దాకా మంత్రిగా పనిచేశారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన ఆరేళ్ళ పాటు కొనసాగారు.

మంత్రి కావాలన్నదే :

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన కళా వెంకటరావు 2024 ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ చేయాలని అనుకున్నారు. కానీ చివరి నిముషంలో మారిన నిర్ణయాల వల్ల ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లికి రావాల్సి వచ్చింది. ఆయన అప్పటి వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేసి మంచి విజయం సాధించారు. ఆయన చీపురుపల్లికి షిఫ్ట్ అయినపుడు మంత్రి పదవి ఇస్తారని ఒక హామీ లభించింది అని ప్రచారం అయితే సాగింది. కానీ చిత్రంగా తొలిసారి ఎన్నికైన గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కి మంత్రి పదవి దక్కింది. దాంతో కళా వర్గం కొంత డీలా పడింది. పోనీ ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ఆయన అనుచరులు భావించారు కానీ అది కూడా జరగలేదు. అయితే విస్తరణలో మంత్రిగా చాన్స్ ఉంటుందని ఆయన వర్గం అయితే కోటి ఆశలే పెట్టుకుంది.

సక్సెస్ చేసిన వైనం :

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు చీపురుపల్లి పర్యటన సక్సెస్ కావడంతో కళా వెంకట్రావు మీద హై కమాండ్ గుడ్ లుక్స్ పడ్డాయని అంటున్నారు విజయనగరం జిల్లాలో గతంలో ఉన్న రాజకీయ సమీకరణలు టీడీపీలో కోట రాజకీయం మూలంగా కళాకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదని ప్రచారం ఉంది. అయితే ఇపుడు జిల్లాలో పూర్తి పట్టు సాధించేందుకు సీనియర్ నేతగా ఉన్న కళా వంటి వారిని ముందుకు తీసుకుని రావాలని చూస్తున్నారు అని అంటున్నారు. దాంతో కళా కోరిక తీరే సమయం వచ్చేసింది అని అంటున్నారు అభిమానులు.

రాజయోగం :

ఏడు పదుల వయసులో ఉన్న కిమిడి కళా వెంకటరావుకు ఇదే చివరి చాన్స్ అని అంటున్నారు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకుని తన కుమారుడు రామ మల్లిక్ ని ఎచ్చెర్ల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇటీవలనే మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆత్మీయ విందుకు కుటుంబ సమేతంగా వెళ్ళి మరీ తన కుమారుడిని చినబాబు దృష్టిలో పడేలా చేసి ఉంచారని చెబుతున్నారు. ఇక మంత్రిగా మరోసారి పనిచేసి రిటైర్ కావాలన్నది కళా కోరిక అంటున్నారు. విస్తరణ ఎపుడు జరిగినా విజయనగరం వంటి కీలక జిల్లాలో సీనియర్ నేతగా కళాకు అవకాశం దక్కుతుంది అని ఆయన అనుచరులు అంచనా కడుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.