'ఆటోమేటిక్' అణు విలయం.. ఉత్తరకొరియా రాజ్యాంగంలో కీలక సవరణ
అణు బాంబు ప్రయోగించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తులో తనపై ఎవరైనా దాడి చేస్తే, ఎవరి అనుమతి లేకుండానే అణుదాడులు చేసేలా రాజ్యాంగానికి సవరణలు చేశారు.
By: Tupaki Desk | 11 May 2026 12:00 AM ISTఅణు బాంబు ప్రయోగించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తులో తనపై ఎవరైనా దాడి చేస్తే, ఎవరి అనుమతి లేకుండానే అణుదాడులు చేసేలా రాజ్యాంగానికి సవరణలు చేశారు. దీంతో ఉత్తరకొరియా అణు సిద్ధాంతం అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రపంచ దేశాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్‌ను లక్ష్యంగా చేసుకుని విదేశీ శక్తులు ఏవైనా దాడులకు పాల్పడితే, ఎవరి ఆదేశాలతో సంబంధం లేకుండానే 'ఆటోమేటిక్'గా అణు దాడులు ప్రారంభమయ్యేలా రాజ్యాంగంలో సవరణలు చేస్తూ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ సమాజంలో ముఖ్యంగా పసిఫిక్ ప్రాంతంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.
మిగతా దేశాలకు భిన్నంగా..
ప్రపంచంలో పలు దేశాలు అణు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అయితే ఆయా దేశాలు తమ రక్షణకు మాత్రమే అణ్వాయుధాలను తయారు చేస్తున్నామని, తమపై ఎవరైనా దాడి చేస్తే, తాము కూడా అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడానికే పరిమితమయ్యేవి. ఇక అణ్వస్త్ర దేశమైన ఉత్తరకొరియా సైతం ఇప్పటివరకు ఇదే విధంగా చెప్పేది. అణ్వాయుధాలను కేవలం తమ స్వీయ రక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తామంటూ చెప్పుకొచ్చేది. కానీ, కొత్తగా ఆమోదించిన 'అణు ఆయుధాల విధానం' మాత్రం తీవ్ర ఉద్రిక్తలకు కారణమవుతోంది.
అనుమానం వచ్చినా ముప్పే..
దేశ నాయకత్వంపై లేదా అణు నియంత్రణ వ్యవస్థపై శత్రు దేశాలు దాడి చేస్తే, ఎదురుదాడికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వ్యవస్థలు స్వయంచాలకంగా అణు క్షిపణులను ప్రయోగిస్తాయని కొత్తగా రాజ్యాంగ సవరణ చేశారు. దీంతో కేవలం దాడి జరిగినప్పుడే కాకుండా, శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉందన్న వంకతో 'ముందస్తుగా' కూడా అణు ఆయుధాలను వాడతామని ఉత్తర కొరియా ప్రకటించడం కలకలం రేపుతోంది. దీంతో అణ్వాయుధాలను వాడటంలో తాము ఎవరితో రాజీ పడే ప్రసక్తే లేదని అధ్యక్షుడు కిమ్ స్పష్టం చేసినట్లేనని అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది.
ఆకస్మాత్తుగా సవరణలు ఎందుకు?
ఉత్తరకొరియా ఆకస్మాత్తుగా తన అణు కార్యక్రమంపై రాజ్యాంగ సవరణ చేయడం తీవ్ర చర్చకు కారణమవుతోంది. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా చేపడుతున్న సైనిక విన్యాసాలు, 'కిల్లర్ స్క్వాడ్స్' భయంతోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా పక్కనే ఉన్న దక్షిణ కొరియా అనుసరిస్తున్న ‘కిల్ చైన్’ వ్యూహానికి ప్రతిస్పందనగానే ఉత్తర కొరియా ఈ 'డెడ్ హ్యాండ్' తరహా వ్యవస్థను సిద్ధం చేసుకుందని అంటున్నారు. కాగా, ఉత్తర కొరియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ శాంతికి విఘాతమని, ఒకవేళ ఉత్తరకొరియా అణు దాడికి పాల్పడితే ఆ దేశ పాలన అంతం కావడానికి దారితీస్తుందని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది.
మరోవైపు ఉత్తరకొరియా రాజ్యాంగ సవరణపై దక్షిణ కొరియా తీవ్ర ఆందోళన చేసింది. కొత్త చట్టం ఉత్తర కొరియాను మరింత ఒంటరిని చేస్తుందని హెచ్చరించింది. రెచ్చగొట్టే ఇలాంటి చర్యల వల్ల కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని దక్షిణ కొరియా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో ఉత్తర కొరియా సంబంధాలు బలపడటం వల్ల కిమ్ ఈ విధమైన దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రాశ్చాత్య మీడియా విశ్లేషిస్తోంది.
