పైకి కనిపించడు కానీ కిమ్ కు సెంటిమెంట్స్ ఎక్కువే... వీడియో వైరల్!
ప్రపంచానికి తెలిసిన ఉత్తర కొరియా అధినేత్ కిమ్ జోంగ్ ఉన్.. ఓ నియంత. ప్రజలకు రకరకాల రూల్స్ పెట్టి వేధించే వ్యక్తి.
By: Tupaki Desk | 2 July 2025 11:28 AM ISTప్రపంచానికి తెలిసిన ఉత్తర కొరియా అధినేత్ కిమ్ జోంగ్ ఉన్.. ఓ నియంత. ప్రజలకు రకరకాల రూల్స్ పెట్టి వేధించే వ్యక్తి. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లనే మూర్ఖత్వం ఆయన సొంతం! ఆయన దయాదాక్షిణ్యాలు అనే పదాలు కూడా తెలియకపోవచ్చు! అయితే... అలాంటి నియంతలోకూ సెంటిమెంట్స్ ఉన్నాయనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
అవును... యుద్ధంలో మరణించిన తమ సైనికుడి మృతదేహాన్ని చూసి ఉత్తరకొరియా నియంత కిమ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అతడు ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరుపున పోరాడి మరణించారు. రష్యా - ఉత్తర కొరియా మధ్య జరిగిన సైనిక ఒప్పందానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ థియేటర్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో ఉత్తర కొరియా, రష్యా కళాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో... యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కొందరు ఉత్తర కొరియా సైనికుల ఫోటోలను ప్రదర్శించారు. ఆ సమయంలో... వారి మృతదేహాలపై చేతులు ఉంచిన కిమ్ జోంగ్ ఉన్.. బాధాతప్త హృదయంతో నివాళులర్పిస్తున్నట్లు కనిపించారు. వీటితోపాటు సైనికులు రక్తంతో రాసుకొన్న నోట్ బుక్ ఫొటోలను కూడా ప్రసారం చేశారు. ఆ నోట్ బుక్ లో సైనికులు రసుకున్న విషయాన్ని న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి.
ఇందులో భాగంగా... "నిర్ణయాత్మక సమయం వచ్చేసింది. మనపై విశ్వాసం ఉంచిన సుప్రీం కమాండర్ (కిమ్) కోసం ధైర్యంగా పోరాడాలి" అని సైనికులు నోట్ బుక్స్ లో రాసుకున్నారు. దీంతో... ఆ వీడియో చూసిన రష్యా, ఉత్తర కొరియా దేశాల ప్రతినిధులు కన్నీరుపెట్టుకోగా.. తన కుమార్తెతో కలిసి హాజరైన కిమ్ కూడా భావోద్వేగానికి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
కాగా... ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంతో తమకు సంబంధం లేద్ని.. ఈ యుద్ధంలో తమ సైనికులు రష్యాతో యుద్ధంలో లేర్ని ఇంతకాలం ఉత్తర కొరియా బుకాయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా విడుదలైన ఈ వీడియోతో యుద్ధంలో కిమ్ సేనలు కూడా ఉన్నట్లు అంగీకరించినట్లయ్యింది.
