అత్యంత భద్రత నడుమ చైనాకు కిమ్...అమెరికాను విభేదించబోతున్నడా?
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ విదేశీ పర్యటనలు చాలా అరుదుగా చేస్తుంటారు. కానీ ప్రతి ప్రయాణం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంటుంది.
By: Tupaki Desk | 2 Sept 2025 1:24 PM ISTఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ విదేశీ పర్యటనలు చాలా అరుదుగా చేస్తుంటారు. కానీ ప్రతి ప్రయాణం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంటుంది. అత్యంత భద్రత కలిగిన రైలులో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి చైనాకు చేరుకున్నారు. బీజింగ్‌లో జరగనున్న సైనిక కవాతులో పాల్గొనేందుకు వెళ్లారని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆయన వెంట విదేశాంగ మంత్రి చో సోన్ హుయ్ సహా పలువురు ప్రముఖ అధికారులు కూడా ఉన్నారు.
చైనా టూర్ ఉద్దేశం ఏమిటి?
2023 తర్వాత ఇది కిమ్ జోంగ్ ఉన్ తొలి విదేశీ యాత్ర కావడం విశేషం. గతంలో ఆయన రష్యా పర్యటన, అంతకుముందు 2019లో కూడా కిమ్ చైనాను సందర్శించారు. అమెరికా ఆంక్షలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఉత్తర కొరియాకు చైనా, రష్యా అండగా నిలబడడమే కిమ్ ప్రయాణం వెనుక ప్రధాన ఉద్దేశమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మద్దతు వల్లే ఉత్తర కొరియా అణు బెదిరింపులను కొనసాగిస్తూ, అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతు తెలుపడం, ఇంకో వైపు చైనాతో దౌత్య సంబంధాలు కొనసాగించడం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలుగా చెప్పుకోవచ్చు.
అత్యంత భద్రతా ఏర్పాట్లు
ఈ సందర్శనలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కఠినంగా అమలు చేశారు. చైనా–ఉత్తర కొరియా సరిహద్దు వద్ద సైనిక నియంత్రణ పెంచడం, మార్గమధ్యంలోని ప్రతి స్టేషన్‌ను తనిఖీ చేశారు. అంతేకాక, పర్యటనకు ముందు కిమ్ ఒక కొత్త ఆయుధ తయారీ కర్మాగారాన్ని సందర్శించారంటూ వచ్చిన వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇది ఆయన ప్రయాణానికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉందనే సంకేతంగా పరిగణిస్తున్నారు.
కిమ్ వాడే ఈ బుల్లెట్ ప్రూఫ్ రైలు ప్రత్యేక ఆకర్షణ. 90కుపైగా కోచ్‌లు కలిగిన ఈ రైలులో లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. కాన్ఫరెన్స్ రూములు, ప్రత్యేక బెడ్‌రూములు, ఆధునిక కమ్యూనికేషన్ సదుపాయాలు, అంతర్జాతీయ వంటకాలు, ఖరీదైన రెడ్ వైన్లు అందుబాటులో ఉంటాయి. రైలు వేగం గంటకు 50 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం అయినా, దాని భద్రతా కవచం దానిని అత్యంత రక్షిత వాహనంగా నిలబెడుతుంది.
ప్రపంచ రాజకీయ పరిణామాలకు సంకేతమా?
ఉత్తర కొరియా నేత తాజా పర్యటనను ఒక సాధారణ కార్యక్రమంగా కాకుండా, రాబోయే ప్రపంచ రాజకీయ పరిణామాలకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఆధిపత్యానికి ప్రతిగా చైనా, రష్యా, ఉత్తర కొరియా ఒక వేదికపై చేరుకోవడం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సంబంధాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.
