మహిళలను పావులుగా వాడుకుంటున్న ఉగ్ర మూకలు.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న విజయవాడ కేసు..
సామాజిక మాధ్యమాలు సమాచార విప్లవానికి వేదికలు అనుకుంటే పొరపాటే.. అవి ఉగ్రవాద విషాన్ని చిమ్మే ఆయుధాలుగా కూడా మారే అవకాశం లేకపోలేదు.
By: Tupaki Political Desk | 9 April 2026 12:30 PM ISTసామాజిక మాధ్యమాలు సమాచార విప్లవానికి వేదికలు అనుకుంటే పొరపాటే.. అవి ఉగ్రవాద విషాన్ని చిమ్మే ఆయుధాలుగా కూడా మారే అవకాశం లేకపోలేదు. ఇటీవల జరిగిన కొన్ని ఈ విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి. విజయవాడ కేంద్రంగా బయటపడిన ‘ఖవాతీన్’ గ్రూప్ ఉదంతం వింటే వెన్నులో వణుకు పుట్టక మానదు. దేశంపై దాడి చేసేందుకు కేవలం మగవారే అక్కర్లేదు, మహిళలను కూడా జిహాదీలుగా మార్చి వినాశనం సృష్టించవచ్చని విదేశీ హ్యాండ్లర్లు వేసిన స్కెచ్ ఇది. 40కి పైగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, టెలిగ్రామ్ గ్రూపులు.. ఇవన్నీ చూస్తుంటే ఇంటి గుమ్మం వరకు ఉగ్రవాదం ఏ స్థాయిలో చొచ్చుకొచ్చిందో అర్థం అవుతోంది. ఇది కేవలం ఒక ప్రాంతానికో, వ్యక్తికో పరిమితమైన సమస్య కాదు; డిజిటల్ తెర వెనుక జరుగుతున్న భయంకరమైన దేశద్రోహ కుట్ర.
ఒక కొత్త యుద్ధ తంత్రం
సాధారణంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో మహిళల ప్రమేయం తక్కువగా ఉంటుందనే అంచనాను తలకిందులు చేస్తూ ‘ఖవాతీన్’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదకరమైన పరిణామం. సైదా బేగం వంటి వారు కీలక పాత్ర పోషిస్తూ పాకిస్థాన్, సిరియా హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉండడం గమనిస్తే.., కుటుంబ వ్యవస్థను దెబ్బతీసి తద్వారా సమాజంలోకి విషాన్ని ఎక్కించే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలను భాగస్వాములను చేయడం ద్వారా భద్రతా బలగాల కళ్లుగప్పడం సులభమనేది ఉగ్రవాదుల కుటిల ఆలోచన.
సాంకేతికతతో మారణహోమం
కేవలం సిద్ధాంత పరమైన ప్రేరేపణే కాకుండా, ‘బ్లాక్ పౌడర్’, ‘ఐఈడీ’ తయారీపై వీడియోల ద్వారా శిక్షణ ఇవ్వడం చూస్తుంటే.., వారు ఏ స్థాయిలో విధ్వంసానికి సిద్ధపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఆయుధాల వినియోగం, స్నిపర్ రైఫిల్స్ వాడకం వంటి అంశాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా నేర్పించడం అంటే.. ఒక వర్చువల్ ఉగ్రవాద శిక్షణ కేంద్రాన్ని వారు మన స్మార్ట్‌ఫోన్లలోనే నడుపుతున్నారన్నమాట. ఇది దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్ విసురుతోంది.
సైబర్ యుద్ధం, ఆర్థిక మూలాలు
ప్రభుత్వ వెబ్‌సైట్‌లను హ్యాక్ చేయడం, సైబర్ దాడులకు పాల్పడడం వంటివి ఆధునిక ఉగ్రవాదానికి నిదర్శనం. భౌతిక దాడుల కంటే డిజిటల్ దాడుల ద్వారా ఒక దేశాన్ని సర్వనాశనం చేయవచ్చని వీరు గ్రహించారు. విదేశాల నుంచి అందుతున్న నిధుల ప్రవాహంపై సీఐ సెల్ దృష్టి పెట్టడం హర్షణీయం. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఇది ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లడం సరైన నిర్ణయం. ఎందుకంటే దీని వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం బలంగా ఉంది.
ఈ కేసును పరిశీలిస్తే.. ఉగ్రవాదం తన స్వరూపాన్ని మార్చుకుందని అనిపిస్తుంది. మునుపటిలా సరిహద్దులు దాటి రానక్కర్లేదు, ఒక సామాజిక మాధ్యమ ఖాతా ఉంటే చాలు యువత మెదళ్లను కలుషితం చేయవచ్చు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకోవడం అనేది అత్యంత అమానవీయమైన, ప్రమాదకరమైన ఎత్తుగడ. ఇలాంటి ఉదంతాలు బయటపడినప్పుడు కేవలం పోలీసుల దర్యాప్తుపైనే భారం వేయకుండా.. తల్లిదండ్రులు, సమాజం కూడా తమ పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఏం చేస్తున్నారో గమనించాలి. ఇస్లామిక్ రాజ్యం స్థాపన వంటి కాలం చెల్లిన ఆలోచనలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో కుట్రదారులు మన మధ్యే ఉంటూ శత్రువుకు సహకరిస్తుండడం అత్యంత విచారకరం. డిజిటల్ నిఘాను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
