పాక్ రక్షణ మంత్రి కొత్త పాట.. భారత వాయుసేనతో ఘర్షణ తప్పదట!
భారతదేశం పై అసంబద్ధ ఆరోపణలు చేస్తూ , ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. తాజాగా, పాక్ రక్షణ మంత్రి ఖవాజ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
By: Tupaki Desk | 4 May 2025 3:14 PMభారతదేశం పై అసంబద్ధ ఆరోపణలు చేస్తూ , ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. తాజాగా, పాక్ రక్షణ మంత్రి ఖవాజ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశం ఉందంటూ ఆయన చేసిన ప్రకటనలు, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయని సూచిస్తున్నాయి. గతంలో 36 గంటల్లో భారత్ దాడి చేస్తుందని చెప్పి ఆ తర్వాత మాట మార్చిన ఖవాజ ఆసిఫ్ ఇప్పుడు కొత్త భయాలను రేకెత్తిస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాలేమిటి దీనికి భారత్ ఎలా స్పందించబోతోంది అనే విషయాలను చూద్దాం.
భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, ఉద్రిక్తతలను చల్లార్చకుండా మరింత రెచ్చగొట్టేలా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసిఫ్ వరుస ప్రకటనలు చేస్తున్నారు. గతంలో "36 గంటల్లో భారత్ దాడి చేస్తుంది" అంటూ హడావుడి చేసిన ఆయన, ఆ గడువు దాటినా ఏమీ జరగకపోవడంతో ఇప్పుడు మరో కొత్త భయాన్ని తెరపైకి తెచ్చారు. భారత వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశాలు అత్యంత ఎక్కువగా ఉన్నాయని ఆయన తాజాగా అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, తమ గగనతలంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించిన రఫెల్ యుద్ధ విమానాలను తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
కేవలం వాయుసేనతో ఘర్షణ గురించే కాకుండా, సింధు నదిపై భారత్ నిర్మిస్తున్న ప్రాజెక్టులను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఖవాజ ఆసిఫ్ మరో తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఒక వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ.. భారత్ ఈ నిర్మాణాలు చేపట్టడమే చట్టవిరుద్ధమని ఆయన వాదించారు. జియో న్యూస్‌లో ఆయన మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దౌర్జన్యం అంటే కేవలం తుపాకులు పేల్చడం మాత్రమే కాదు, అది అనేక రూపాల్లో ఉంటుంది. నీటిని ఆపడం లేదా మళ్లించడం కూడా ఒక రకమైన దౌర్జన్యమే. ఒకవేళ అదే జరిగితే, పాకిస్తాన్‌లో తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. భారత్ ఒకవేళ ఆ నిర్మాణాలు కొనసాగిస్తే, పాకిస్తాన్ వాటిని కూల్చివేస్తుందని ఆయన బెదిరించారు. రానున్న కాలంలో భారత్‌తో ఘర్షణలు మరింత తీవ్రమవుతాయని, శాంతియుత పరిష్కారం కనుగొనడం కష్టమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, పరిస్థితిని చక్కదిద్దడానికి అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గత నెల చివర్లో ఖవాజ ఆసిఫ్ చేసిన భారత్ 24-36 గంటల్లో సైనిక చర్యకు పాల్పడుతుందనే సంచలన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. భారత్‌లో భద్రతా కేబినెట్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చిన సమయంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, ఆయన జోస్యం చెప్పినట్లు ఎలాంటి సైనిక చర్య చోటుచేసుకోలేదు. ఖవాజ ఆసిఫ్ ఈ తరహా బాధ్యతారహిత ప్రకటనలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.