అయ్యో ఖర్గే సార్.. మీరూ ‘అధిష్ఠానమే’... ఆ సంగతి గుర్తుంచుకోండి
కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట ‘హై కమాండ్’. తెలుగు చెప్పాలంటే ‘అధిష్ఠానం’.
By: Tupaki Desk | 30 Jun 2025 7:21 PM ISTకాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట ‘హై కమాండ్’. తెలుగు చెప్పాలంటే ‘అధిష్ఠానం’. రాష్ట్రాల్లో ఎంత పవర్ ఫుల్ నాయకుడైనా అధిష్ఠానం మాటకు కట్టుబడాల్సిందే..! ఏ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి అత‍్యంత బలమైన నాయకుడో అయితే తప్ప..! అంతెందుకు..? ఉమ్మడి ఏపీలోనే ఐదేళ్లలో ముగ్గురు- నలుగురు ముఖ్యమంత్రులను మార్చిన ఉదంతాలు కాంగ్రెస్ చరిత్రలో ఉన్నాయి. అయితే, సోనియాగాంధీ నాయకత్వంలోకి వచ్చాక మాత్రం ఒకసారి సీఎంగా చేసిన వ్యక్తిని వారంతట వారు చెడగొట్టుకుంటే తప్ప ఐదేళ్లు కొనసాగించడం చూస్తున్నాం. అధిష్ఠానం కరుణం ఉంటే ఎలా ఉంటుందో ఇదే ఉదాహరణ.
అధిష్ఠానమే అన్నీ అయిన కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబానివే సర్వాధికారాలు. ఇంకా కాంగ్రెస్‌లో స్వేచ్ఛ కూడా ఎక్కువే. దీనిని ఆ పార్టీ నాయకులు అంతర్గత ప్రజాస్వామ్యం అని చెబుతూ ఉంటారు. అలాంటి పార్టీలో దాదాపు మూడేళ్ల కిందట అనూహ్య పరిణామం. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ వైదొలగాక రాహుల్ గాంధీ అయిష్టతో అధ్యక్షుడిగా కొత్తవారిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. అనుభవం రీత్యా అలా కర్ణాటక నాయకుడైన మల్లికార్జున ఖర్గేకు అవకాశం దక్కింది. దళిత నాయకుడైన ఖర్గే.. పార్టీకి అత్యంత విశ్వాసపాత్రులు. చాలా కిందిస్థాయి నుంచి ఎదిగినవారు. ఇండియా కూటమి ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారు. ఆ కూటమి విఫలమైనా, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోలేక పోయినా ఖర్గేను అధ్యక్షుడిగానే కొనసాగిస‍్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవహారాలను సంబాళించగల సమర్థతే దీనికి కారణం.
ఇక ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో రెండేళ్ల కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఈయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పట్లోనో, అంతకుముందో ఖర్గే ఓ నిర్ణయాన్ని ‘అధిష్ఠానం’ తీసుకుంటుందని చెప్పారు. ఇది ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలకు తావిచ్చింది. స్వయంగా అధ్యక్షుడిగా ఉండి.. అధిష్ఠానం అంటారేమిటనే ప్రశ్నలు వచ్చాయి. కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేశాయి. తాజాగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపైనా ఖర్గే మరోసారి ‘అధిష్టానం నిర్ణయిస్తుందని’ జవాబిచ్చారు. హైకమాండ్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని..వారి నిర్ణయాల గురించి ఎవరూ చెప్పలేరని అన్నారు. ఎవరూ అనవసర సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవద్దని కోరారు. అయితే, కర్ణాటకకే చెందినవారు కాబట్టి.. ‘అధిష్ఠానాన్ని’ ప్రత్యేకంగా వేరు చేస్తూ ఆయన స్పందించారు. కానీ, వేరే అర్థంలో మాత్ర కాంగ్రెస్ పార్టీ ఇంకా గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉందనే విధంగా వినిపించింది. దీంతో ఖర్గే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ.. అధిష్ఠానందే నిర్ణయం అని ఎలా అంటారని.. ఆయన కంటే ‘అధిష్ఠానం’ ఎవరని ప్రశ్నిస్తున్నాయి. గాంధీ కుటుంబం చేతిలోనే కాంగ్రెస్ ఉంటుందని.. పదవి ఇచ్చినా.. పవర్స్ ఇవ్వరని బీజేపీ నేతలు విమర్శల దాడి చేస్తున్నారు.
ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ, కర్ణాటకకు చెందిన తేజస్వీ సూర్య ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ లో హైకమాండ్ రూపుం లేనిది. ఎవరికీ కనిపించదు, వినిపించదు కానీ.. అది ఉన్నట్లు అందరూ భావిస్తుంటారు. చివరకు కాంగ్రెస్ అధిష్ఠానం అని ప్రజలు భావిస్తున్న పార్టీ అధ్యక్షుడు కూడా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
