Begin typing your search above and press return to search.

ఈ సీటుకు పోటీ పెరిగిపోతోందా ?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీలుగా పోటీచేయటానికి నేతల మధ్య పోటీ బాగా పెరిగిపోతోంది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 10:30 AM GMT
ఈ సీటుకు పోటీ పెరిగిపోతోందా ?
X

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిపోతోంది. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీలుగా పోటీచేయటానికి నేతల మధ్య పోటీ బాగా పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే ఖమ్మం లోక్ సభ టికెట్ కోసం మంత్రుల కుటుంబసభ్యుల మధ్య పోటీ పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే ఖమ్మం పార్లమెంటు సీటు కోసం ఐదుమంది పోటీపడుతున్నారు. వీరిలో ముగ్గురు మంత్రుల కుటుంబసభ్యులు కావటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకింత పోటీ అంటే నామినేషన్ వేస్తే గెలుపు గ్యారెంటీ అనే నమ్మకం పెరిగిపోతుండటమే.

మిగిలిన ఏ జిల్లాలో లేనివిధంగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు. మల్లుభట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి మంత్రలుగా ఉన్నారు. ముగ్గురు కూడా జిల్లాలో చాలా కీలకమనే చెప్పాలి. అందుకనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మంలో పోటీచేయటానికి భట్టి భార్య దేవకి గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఖమ్మం లోక్ సభలో పోటీచేయబోయేది తానే అన్నట్లుగా ఆమె ప్రచారం చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో పొంగులేటి తన దమ్ముడు ప్రసాదరెడ్డికి టికెట్ కావాలని గట్టిగా పట్టుబడుతున్నారట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాతే జిల్లా పార్టీలో ఒక్కసారిగా ఊపు పెరిగిందన్నది వాస్తవం. జిల్లా వ్యాప్తంగా తనకున్న మద్దతుదారుల కారణంగానే బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టగలిగారు. కాబట్టి తన తమ్ముడికి టికెట్ ఇవ్వాల్సిందే అని మంత్రి పట్టుదలగా ఉన్నారట. ఇక తుమ్మల కూడా కొడుకు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొడుకు యుగంధర్ తండ్రి తరపున చాలాకాలంగా జిల్లాలో వ్యవహారాలు నడుపుతున్నారు.

తుమ్మల పార్టీలో చేరిన తర్వాతే కాంగ్రెస్ కు బలమైన మద్దతుదారులు దొరికారన్నది వాస్తవమే. తుమ్మలకు జిల్లా వ్యాప్తంగా బలమైన మద్దతుదారులున్నారు. పొంగులేటి, తుమ్మల జాయిన్ అయిన కారణంగానే జిల్లాలో పదిసీట్లలో కాంగ్రెస్ తొమ్మిదిచోట్ల గెలిచింది. వీళ్ళు కాకుండా కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి, వ్యాపారస్తుడు వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి ఖమ్మం టికెట్ కోసం కాంగ్రెస్ లో విపరీతమైన పోటీ పెరిగిపోతోందన్నది వాస్తవం..