Begin typing your search above and press return to search.

ఖమ్మంకు భారీ బొనాంజా.. 5 సీట్లకు 3 మంత్రి పదవులు..

ఖమ్మం జిల్లాకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ బొనాంజా దక్కింది.. కేవలం ఐదు నియోజకవర్గాలు ఉన్న జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి.

By:  Tupaki Desk   |   7 Dec 2023 2:30 PM GMT
ఖమ్మంకు భారీ బొనాంజా.. 5 సీట్లకు 3 మంత్రి పదవులు..
X

ఖమ్మం జిల్లాకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ బొనాంజా దక్కింది.. కేవలం ఐదు నియోజకవర్గాలు ఉన్న జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. పాలేరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నుంచి రెండో సారి, మొత్తమ్మీద ఆరోసారి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు, మధిర నుంచి నాలుగోసారి విజయం సాధించిన మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి పదవులు దక్కాయి.

జనరల్ సీట్ల ఎమ్మెల్యేలు ఇద్దరికీ..

10 స్థానాలున్న ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్, సీపీఐ 9 స్థానాలు గెలిచాయి. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం జనరల్ సీట్లు కాగా.. కొత్తగూడెంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలిచారు. పాలేరు, ఖమ్మం నుంచి నెగ్గిన పొంగులేటి, తుమ్మలకు మంత్రి పదవులు లభించాయి. ఎస్సీ రిజర్వుడ్ మధిరలో విజయం సాధించిన, మొన్నటివకు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఉన్న భట్టికీ మంత్రి పదవి దక్కింది.

తొలిసారి ఇద్దరికీ.. తుమ్మలకు పలుసార్లు

భట్టి 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ విప్ గా, అనంతరం డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు. 2014లో గెలిచినా పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో సీఎల్పీ ఉప నేత పదవితో సరిపెట్టుకున్నారు. ఇక పొంగులేటి మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసి నెగ్గారు. వెంటనే ఎమ్మెల్యే అయ్యారు. అయితే, 2014లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా నెగ్గిన ఆయనకు బీఆర్ఎస్ లో చేరాక.. 2019లో టికెట్ దక్కలేదు. దీంతో ఆరు నెలల కిందట కాంగ్రెస్ లోకి వచ్చారు. పాలేరు నుంచి తొలిసారి పోటీకి దిగి విజయం సాధించారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు 1985, 1994, 1999, 2015లో మంత్రి పదవులు చేపట్టారు.

ఒకే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు

సమీకరణాల ప్రకారం సహజంగా ఒక జిల్లాకు ఒక మంత్రే ఉంటారు. పెద్ద జిల్లాలైతే ఇద్దరు ఉంటారు. కానీ ఖమ్మంకు మూడు మంత్రి పదవులు లభించాయి. ఇది విశేషమే. 10 సీట్ల ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ మొత్తం 8 స్థానాలు గెలిచింది. సీపీఐ ఒకదాంట్లో నెగ్గింది. ఒకటి బీఆర్ఎస్ పరమైంది. అంటే.. ఇక మిగిలిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వీరికి విస్తరణలోనూ మంత్రి పదవులకు అవకాశం లేదు. కాగా, ఒకే జిల్లా నుంచి ఉమ్మడి రాష్ట్రంలో తప్ప.. విభజన తర్వాత ముగ్గురు మంత్రులు ఉన్న ఉదంతాలు లేవు.