Begin typing your search above and press return to search.

అవును.. ఈ మామిడి కేజీ రూ.3 లక్షలే

వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ ఆరంభం అవుతుంది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ మక్కువగా తినే మామిడిపండ్లను ఇష్టంగా అస్వాదిస్తారు.

By:  Tupaki Desk   |   3 May 2025 9:37 PM IST
అవును.. ఈ మామిడి కేజీ రూ.3 లక్షలే
X

వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ ఆరంభం అవుతుంది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ మక్కువగా తినే మామిడిపండ్లను ఇష్టంగా అస్వాదిస్తారు. రకాన్ని బట్టి కేజీ మామిడి రూ.150 నుంచి రూ.400 వరకు ఉంటాయి. కొన్ని ప్రత్యేక జాతులకు చెందిన మామిడి కేజీ ఐదారు వందలు ఉంటాయి. కానీ.. ఇప్పుడు చెప్పే మామిడి మాత్రం అందుకు భిన్నం. ఈ మామిడి పండ్లు కేజీ రూ.3 లక్షల వరకు పలుకుతాయి. ఈ ధర విన్నంతనే ఆశ్చర్యంతో అవాక్కు కావటమే కాదు.. బంగారం ఏమైనా ఉంటుందా సామీ అనుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం పట్టణానికి చెందిన ఒక రైతు మాత్రమే వీటిని పండిస్తారని చెబుతున్నారు. ఇంతకూ ఈ మామిడి పండ్లకు అంత ధర ఎందుకు? దాని ప్రత్యేకత ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

ఈ మామిడి పండ్లను మియాజాకీగా పిలుస్తారు. దీన్ని సదరు రైతు కాలిఫోర్నియా నుంచి ఒక్కో మొక్కను రూ.12 వేల చొప్పున తెప్పించారు. మొత్తం 30 మొక్కల్ని దిగుమతి చేసుకొని 2020లో నాటారు. ఈ మామిడి మొక్క మిగిలిన రకాల కంటే నెల ముందుగా పూతకు వస్తుంది. అంతేకాదు.. పరిమిత సంఖ్యలోనే ఇది పండుతుంది. 2020లో ఈ మొక్కల్ని నాటితే.. మొదటిసారి పంట 2024లో వచ్చింది. అప్పుడు కేవలం 30 కాయలు పండగా.. ఈ ఏడాది 80 కాయలు మాత్రమే పండాయి.

ప్రతి సంవత్సరం నవంబరు నుంచి డిసెంబరు మధ్యలో ఈ మామిడి తోట పూతకు వస్తుంది. అంతర్జాతీయంగా ఈ పండ్ల ఖరీదు కేజీ రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య పలుకుతాయి. ఒక్కో పండు అర కేజీ బరువు ఉంటుందని చెబుతున్నారు. రసం పీల్చే పురుగులు.. ఆకుమచ్చ పురుగులు ఈ చెట్లకు అత్యంత ప్రమాదకరంగా మారుతుంటాయి. వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకూ ఈ మామిడి పండ్లకు అంత ధర ఎందుకంటే.. దీనికుండే ప్రత్యేక రుచేనని చెబుతారు. ఎరుపు లేదంటే ఊదా రంగులో ఉండే ఈ మామిడిపండ్ల తీపి మాటల్లో చెప్పలేమని చెబుతారు.

పోషకాల పరంగా కూడా ఇదెంతో విలువైన మామిడి పండుగా చెబుతారు. యాంటీ ఆక్సిడెంట్లు.. సీ..ఈ.. ఏ.. కె.. విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయని.. చర్మానికి మేలు చేసి.. క్యాన్సర్ రిస్కును తగ్గించే లక్షణం ఈ పండు ప్రత్యేకత. అంతేకాదు.. ఈ పండు తిన్న తర్వాత కూడా ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచటం దీనికున్న మరో విశేషమైన గుణం. మరి.. అందరూ పండించొచ్చు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. దీన్ని పండించేందుకు అనువైన భూమి కష్టమని చెబుతారు. ఇన్ని రిస్కులు ఉండటంతో దీన్ని పండించటం అందరికి సాధ్యమయ్యేది కాదు.

1984లో జపాన్ లోని మియాజాకి ప్రాంతంలో ఈ మామిడి చెట్లను తొలిసారి పండించారు. అందుకే దీనికి మియాజాకి మామిడి అన్న పేరు వచ్చింది. ఆ దేశంలో వీటికి ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. ఈ రకం మామిడిపండ్లను పండించేందుకు పంజాబ్ కు చెందిన ఒక రైతు కొంతకాలం క్రితం ప్రయత్నం చేశారు. పంటను కాపాడుకోవటానికి బౌన్సర్లు పెట్టిన వైనం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరూ చర్చించుకునేలా చేసింది. ఈ పంటను ఖమ్మం పట్టణంలో పండించే యజమాని తన పేరు.. వివరాలు వెల్లడించేందుకు సుముఖంగా ఉండకపోవటం గమనార్హం.