Begin typing your search above and press return to search.

ఖమేనీ కనిపించారోచ్.. ఇజ్రాయెల్, అమెరికా ప్రతీకారం తీర్చుకుంటాయా?

దాదాపు 20 రోజుల తర్వాత ఖమేనీ బహిరంగ ప్రపంచానికి కనిపించారు. ఇరాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   6 July 2025 3:35 PM IST
ఖమేనీ కనిపించారోచ్.. ఇజ్రాయెల్, అమెరికా ప్రతీకారం తీర్చుకుంటాయా?
X

అణు చర్చలు విఫలం.. ఇజ్రాయెల్ తో సంఘర్షణ.. మరోవైపు స్వదేశంలో వ్యతిరేకత.. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి.. ఇంకోవైపు అమెరికా-ఇజ్రాయెల్ ఎప్పుడు దాడి చేసి చంపేస్తాయో అన్న భయాందోళనలు.. దీంతో గుర్తుతెలియని ప్రదేశంలోకి వెళ్లిపోయారు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ. ఇరాన్ లో తిరుగులేని నాయకుడు అయిన ఆయనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిప్పులు చెరిగారు. ఖమేనీ ఏ కలుగులో దాక్కున్న సంగతీ తమకు తెలుసని.. ఆయన పని పడతామని హూకరించారు. కానీ, ఉద్రిక్తతలు చప్పున చల్లారడంతో ఖమేనీ బయటకు వచ్చారు.

దాదాపు 20 రోజుల తర్వాత ఖమేనీ బహిరంగ ప్రపంచానికి కనిపించారు. ఇరాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఇరాన్ ప్రజలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా భీకర దాడులు చేసిన నష్టం గురించి కథనాలు వస్తున్న వేళ.. ఇరాన్ మళ్లీ పుంజుకుంటుందనే అంచనాల మధ్య... ఖమేనీ ఉనికి చాటుకోవడం చర్చనీయమైంది.

శనివారం మొహర్రం.. దీంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో జరిగిన మతపరమైన కార్యక్రమానికి ఖమేనీ హాజరయ్యారు. ఇరాన్ షియా దేశం అనే సంగతి తెలిసిందే. బలిదానానికి గుర్తుగా షియా ముస్లింలు మొహర్రం జరుపుకొంటారు. పండుగ నేపథ్యంలోనే ఖమేనీ బయటకు వచ్చారు.

షియా ముస్లింలకు మొహర్రం చాలా ముఖ్యమైనది. ఈ సందర్భంగా సంతాప దినాలు నిర్వహిస్తారు. వీటిలోనే ఖమేనీ కనిపించారు. మొహర్రం జరుపుకొంటున్న హాలులోకి ఖమేనీ ప్రవేశిస్తున్న ఫొటోలను ఇరాన్ స్టేట్ టీవీ మీడియాకు విడుదల చేసింది.

షియా ప్రాబల్య ఇరాన్ లో మొహర్రం కార్యక్రమాలకు ఖమేనీ తప్పక హాజరవుతారు. సంప్రదాయ నల్ల దుస్తులు ధరించి పాల్గొంటారు. దీంతో ప్రజలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. గత నెల 14 ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మొదలైంది. ఆ వెంటనే ఖమేనీ గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు. కేవలం వాయిస్ రికార్డులను బయటకు విడుదుల చేశారు. మరిప్పుడు ఇజ్రాయెల్-అమెరికా ఎలా స్పందిస్తాయో చూడాలి.