Begin typing your search above and press return to search.

'యుద్ధం మొదలైంది'.. ట్రంప్ కు రిప్లై ఇచ్చిన ఇరాన్.. వాట్ నెక్స్ట్?

అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలో అత్యంత కీలకంగా చెప్పుకోవాల్సిన పరిణామం తాజాగా చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 10:02 AM IST
యుద్ధం మొదలైంది.. ట్రంప్  కు రిప్లై ఇచ్చిన ఇరాన్.. వాట్  నెక్స్ట్?
X

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ఐదు రోజులుగా అవిరామంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా రగిలిపోతోంది. ఇరు దేశాల మధ్య గగనతలం క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో మండిపోతుంది! ఈ నేపథ్యంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ నుంచి షాకింగ్ రిప్లై వచ్చింది.

అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలో అత్యంత కీలకంగా చెప్పుకోవాల్సిన పరిణామం తాజాగా చోటు చేసుకుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కి చేరాయని అంటున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి బదులుగా ఖమేనీ చేసిన పోస్టు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... ఇరాన్ సోకాల్డ్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కొన్నారో తమకు తెలుసని.. ఆయనను చంపడం తమకు పెద్ద సమస్య కాదని.. కాకపోతే ప్రస్తుతం ఆ పని చేయాలనుకోవడం లేదని.. ఆయన బేషరుగా లొంగిపోవాలని.. లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారతాయని హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు.

ఈ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ తదుపరి నిర్ణయం ఏమిటనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ పోస్ట్ చేసిన కొన్న్ని గంటల తర్వాత అలీ ఖమేనీ 'ఎక్స్' ఖాతాలో ఓ పోస్టు దర్శనమిచ్చింది. "నమీ పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జాల్ఫికర్ తో కలిసి ఖైబర్ కు వచ్చేశారు" అని అందులో రాశారు.

దీంతోపాటు ఖడ్గం చేతబట్టి కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను దీనికి జతచేశారు. ఆ సమయంలో కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లు ఆ చిత్రంలో ఉంది. దీంతో... ఇరాన్ చెప్పాలనుకున్నది చెప్పేసిందని.. యుద్ధం మొదలైందని.. ఇది మరింత తీవ్రతరం కాబోతుందని అంటున్నారు పరిశీలకులు.

ఆ తర్వాత కాసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరో పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా.. "మేము ధీటుగా ప్రతిస్పందిస్తాం.. ఎవరిపైనా దయ చూపేది లేదు" అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. దీంతో.. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో ఆరో రోజు ఏమి జరగబోతుందనేది తీవ్ర సంచలనంగా మారింది.