Begin typing your search above and press return to search.

కెనడాలో ఉగ్రవాదానికి 4 దశాబ్దాల చరిత్ర!

కెనడాలో ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లు హత్య చేశారంటూ కలకలం రేపారు..

By:  Tupaki Desk   |   20 Sep 2023 6:35 AM GMT
కెనడాలో ఉగ్రవాదానికి 4 దశాబ్దాల చరిత్ర!
X

కెనడాలో ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లు హత్య చేశారంటూ కలకలం రేపారు.. ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో. అంతేకాకుండా కెనడాలో భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. దీనికి దీటుగా ప్రతిస్పందించిన భారత్‌ తమ దేశంలోని కెనడా సీనియర్‌ దౌత్యవేత్తను దేశం విడిచిపోవాలని ఆల్టిమేటం జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

కాగా కెనడాలో భారత వ్యతిరేకత ఇప్పటిది కాదని తెలుస్తోంది. కెనడాలో ఖలిస్తాన్‌ ఉగ్రవాద మూకలు 40 ఏళ్ల నుంచే తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయని చెబుతున్నారు. మానవ అక్రమ రవాణా, హత్యలు చేయడం, వ్యవస్థీకృత నేరాలు, చట్టవ్యతిరేక కార్యలాపాలకు పాల్పడటం వంటివి ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. కెనడాలో పెద్ద ఎత్తున సిక్కు ఓటర్లు ఉండటం.. వారంతా తమ పార్టీకి మద్దతు ఇస్తుండటంతో జస్టిన్‌ ట్రూడో వారిని వెనకేసుకొస్తున్నారని పేర్కొంటున్నారు.

భారత్‌ తర్వాత ప్రపంచంలో కెనడాలోనే సిక్కు జనాభా అధికంగా ఉండటం గమనార్హం. కెనడా జనాభా లెక్కల ప్రకారం దాదాపుగా 8 లక్షల మంది సిక్కులు (మొత్తం కెనడా జనాభాలో 2%పైగా) ఉన్నారని అంటున్నారు. అంతేకాకుండా వీరి జనాభా శరవేగంతో పెరుగుతోందని చెబుతున్నారు. కెనడాలో న్యూ డెమోక్రాటిక్‌ పార్టీ (ఎన్‌డీపీ) పగ్గాలను సిక్కు నాయకుడైన జగ్మిత్‌ సింగ్‌ ధాలివాల్‌ 2017లో చేపట్టారు. ఆ తర్వాత ఆయన ఖలిస్తాన్‌ వేర్పాటువాదులకు తన మద్దతును అందజేస్తూ వస్తున్నారు.

2021లో ప్రధానమంత్రి జస్టిస్‌ ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీ మెజార్టీ స్థానాలను గెలవలేకపోవడంతో ఎన్‌డీపీ మద్దతు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు పేట్రేగిపోతున్నారు. తమ ప్రభుత్వం కొనసాగడానికి జగ్మిత్‌ సింగ్‌ మద్దతు అవసరం కావడంతో ప్రస్తుత ప్రధాని జస్టిన్‌ ట్రూడో వారిని ఏమీ చేయలేకపోతున్నారు.

భారతీయులపై దాడులు జరుగుతున్నా, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నా, భారత రాయబార కార్యాలయంపై దాడులు జరిగినా జస్టిన్‌ ట్రూడో లైట్‌ తీసుకున్నారు. ఎన్నోసార్లు భారత్‌.. ఈ విషయంలో కెనడాకు విజ్ఞపులు చేసింది. అయినా ట్రూడో విననట్టుగా వదిలేశారు. ఉగ్రమూకలు మరింత చెలరేగిపోతున్నా ప్రధాని ట్రూడో ఏమీ చేయలేకపోతున్నారు.

ఒక్క కెనడాలోనే కాకుండా బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాల్లోనూ ఖలిస్థాన్‌ మూకలు చెలరేగిపోతున్నాయి. ఈ ఏడాది జూలైలో ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులను రాడ్లతో చితకబాదాయి. బ్రిటన్‌ లో భారతీయ జాతీయ జెండాను ధ్వంసం చేశారు. ఇలా పలు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. భారత కార్యాలయాలు, హిందూ ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. మార్చిలో లండన్‌ లో భారత హైకమిషనర్‌ కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

2022 మేలో మొహాలిలో పంజాబ్‌ ఇంటెలిజెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ పై గ్రెనేడ్‌ దాడి వెనుక కూడా ఖలిస్తాన్‌ మూకల హస్తం ఉంది.

ప్రస్తుతం కెనడా పార్లమెంటులో 18 మంది సిక్కు ఎంపీలు ఉన్నారు. మరోవైపు కెనడాలోనే సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) అనే సంస్థ ప్రత్యేక ఖలిస్తాన్‌పై రెఫరెండం చేపట్టి తమకు లక్ష మందికిపైగా మద్దతు పలుకుతున్నట్టుగా ప్రకటించింది.

అంతేకాకుండా దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యను కీర్తిస్తూ జూన్‌ 4న ఖలీస్తాన్‌ ఉద్యమకారులువివిధ కార్యక్రమాలు చేపట్టినా కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇందిర, ఒక సిక్కు చేతిలో తుపాకీ ఉన్న చిత్రాలకి సంబంధించిన కటౌట్లు కెనడాలోని ప్రధాన నగరమైన టొరాంటో వీధుల్లో ఏర్పాటయ్యాయి. దర్బార్‌ సాహిబ్‌ పై దాడులకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగిందంటూ దానిపై రాసి హత్యను సమర్థించుకున్నారు.

ఇందిర హత్యని ఒక సంబరంగా పేర్కొంటూ 2002లో టొరాంటో ప్రధాన కేంద్రంగా ప్రచురితమయ్యే సంజా సవేరా మ్యాగజైన్‌ కథనాలు వండి వార్చింది. ఆలాంటి పత్రికకు ప్రభుత్వం అత్యధికంగా వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ద్వారా తన వైఖరి ఏంటో చెప్పకనే చెప్పింది.

ప్రస్తుత ప్రధాని జస్టిన్‌ ట్రూడో తండ్రి పియరే ట్రూడో 1980లో కెనడా ప్రధానిగా ఉన్నారు. అప్పట్లోనే ఖలిస్తాన్‌ కార్యకలాపాలపై భారత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఆయనకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆ నాటి ప్రభుత్వం కూడా ఉదాసీనంగానే వ్యవహరించింది.

ఇందిరాగాంధీ హత్య తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మళ్లీ ఖలిస్థాన్‌ ఏర్పాటువాదులు పేట్రేగుతున్నారు. చైనా, పాకిస్తాన్‌ వంటి దేశాలు ఖలిస్తాన్‌ వేర్పాటు వాదులకి సాయం అందిస్తున్నాయని అంటున్నారు.