Begin typing your search above and press return to search.

పోలీసులు న్యాయ పోరాటం చేయాల్సిందేనా ?

పోలీసు ఉంటే రక్షణ భద్రత అని సామాన్యుడు ఫీల్ అవుతాడు. ఖాకీ దుస్తులను చూడగానే సామాన్యుడికి తెలియని భయం అలాగే గౌరవం రెండూ ఒకేసారి కలుగుతాయి.

By:  Tupaki Desk   |   9 April 2025 9:50 PM IST
పోలీసులు న్యాయ పోరాటం చేయాల్సిందేనా ?
X

పోలీసులు అంటేనే నడుస్తున్న చట్టం. వారే ఎదురుగా కనిపించే ప్రభుత్వం. వారికి ఎంతటి పవర్ ఉంది అన్నది వారు సమర్ధవంతంగా వ్యవహరించే తీరుని బట్టే అర్ధం అవుతుంది. పోలీసు ఉంటే రక్షణ భద్రత అని సామాన్యుడు ఫీల్ అవుతాడు. ఖాకీ దుస్తులను చూడగానే సామాన్యుడికి తెలియని భయం అలాగే గౌరవం రెండూ ఒకేసారి కలుగుతాయి.

పోలీసులు విధులు నిర్వహించడం అన్నది అంత తేలిక వ్యవహారం కాదు. అది ఒక విధంగా కత్తి మీద సాములాంటిది. ఎందుకంటే బాహా బాహీ హోరా హోరీగా సాగే ఘర్షణ లో పోలీసు పాత్ర అత్యంత కీలకం. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా నింద వచ్చి మీద పడుతుంది. న్యాయం చేయబోయి విమర్శల పాలు అవుతారు.

ఇక రాజకీయం బాగా వేడి మీద ఈ కాలంలో పోలీసులు నిజంగా నలిగిపోతున్నారు అనే చెప్పాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న వారు మొదట ఆక్షేపించేది పోలేసులనే. పోలీసులు ప్రభుత్వం వైపు ఉంటున్నారు అని విమర్శలు చేస్తూంటారు.

నిజానికి ఒక ప్రభుత్వానికి పోలీసులే కీలకమైన అంగంగా ఉంటారు. అందువల్ల పోలీసులను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని వేరేగా చూడలేం. అదే సమయంలో పోలీసులు ప్రభుత్వం మాట వినాల్సి ఉంటుంది. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు రాజకీయ పార్టీలు ఏమిటి అన్నది వారికి పట్టదు. తాము ప్రభుత్వానికి పనిచేస్తున్నామనే చేస్తారు.

దాంతో విపక్షం మాత్రం సులువుగానే వారిని విమర్శిస్తుంది. ఇదంతా నాణేనికి ఒక వైపుగా చూస్తే రెండో వైపున పోలీసులలో నూటికి తొంబై శాతం పైగా వృత్తికి కట్టుబడే పనిచేస్తూంటారు. ఆ మిగిలిన శాతం అతి ఉత్సాహంతో వ్యవహరిస్తారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతోనే మొత్తం వ్యవస్థ మీద విమర్శలు వస్తున్నాయి అని అంటున్నారు.

గతంతో పోలిస్తే పోలీసుల మీద విమర్శలు ఎక్కువ అయిపోతున్నాయి. అయిదేళ్ళ వైసీపీ హయాంలో పోలీసుల మీద నాటి విపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసింది. ఇపుడు వైసీపీ వంతు అన్నట్లుగా ఉంది. వారినే టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే ముందే చెప్పినట్లుగా పోలీసుల్లో ఎవరైనా రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించినట్లు అయితే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పవచ్చు.

అంతే తప్ప వారిని గుడ్డలూడదీసి కొడతామని ఒకటి రెండు సార్లు అనడం మంచి విధానం కాదు. ఎందుకంటే పటిష్టమైన వ్యవస్థగా మనకు ఉన్నది పోలీసులే. ఆ వ్యవస్థను జనంలో తక్కువ చేయడం వల్ల ఇబ్బందులే వస్తాయి. ఇక కీలక స్థానాల్లో ఉన్న వారు గతంలో మంత్రులుగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు కూడా ఈ విధంగా పోలీసులను టార్గెట్ చేసుకోవడం మీద అంతా చర్చిస్తున్నారు.

ఇక మరో మాట కూడా ఉంది ఒక ప్రభుత్వంలో అతి ఉత్సాహం మీద పనిచేశారు అన్నది తీసుకుని కొత్త ప్రభుత్వం రాగానే వారిని లూప్ లైన్ లో పెడుతున్నారు. సరైన పోస్టింగులు ఇవ్వడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఆ విధంగా పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. చట్టం ఎవరికైనా ఒక్కటే. చట్టాన్ని అతిక్రమించి పోలీసులు ఎవరైనా పనిచేస్తే వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు. అయితే అవన్నీ పారదర్శకంగా ఉండాలి. అంతే తప్ప వేధింపులు కక్ష సాధింపులుగా ఉండకూడదు అని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే మన వ్యవస్థలను గౌరవించుకోవాలన్నది రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధుల నుంచి చూస్తే ఆయా వ్యవస్థలలో పనిచే వారి అందరికీ ఉండాల్సిన భావనగా చూడాలి. ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని అధికారాలూ ఉంటాయి. కానీ వాటిని ఎపుడు ఎక్కడ వాడాలీ అన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తానికి చూస్తే పొట్ట కూటి కోసం పోలీసన్నా అన్న పాట గుర్తుకు వస్తోంది. పార్టీ క్యాడర్ కి ధైర్యం చేప్పాలనో హుషార్ తేవాలనో మధ్యలో పోలీసుల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే మనకు ఉన్న పటిష్టమైన వ్యవస్థను కించపరచుకున్నట్లుగా ఉంటుంది.

ఇక పోలీసులు సైతం వ్యక్తిగత హోదాలో రాజకీయ విమర్శలు చేయడం మంచి విధానం కాదు. పోలీసులకు ఇబ్బంది ఉంటే వారి సంఘం ప్రతినిధులు ఎటూ స్పందిస్తారు కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడి ప్రజల దృష్టిలో వేరే అర్ధాలు వచ్చేలా వారే వ్యవస్థకు ఇబ్బంది తీసుకురాకుండా ఉంటే మేలు అన్నది కూడా అంతా సూచిస్తున్నారు ఇక తమ వ్యవస్థ పట్ల రాజకీయ పార్టీలు పరిమితి దాటి మాట్లాడుతున్న తీరు మీద పోలీసులు న్యాయ పోరాటం చేయాల్సిందేనా అంటే వేచి చూడాల్సిందే.