ఖాబీ లేమ్: అమెరికా ఇమ్మిగ్రేషన్ నిర్బంధంలో వైరల్ స్టార్.. ఏం జరిగిందంటే?
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా కోట్ల మందిని తన హావభావాలతో నవ్వించిన ఖాబీ లేమ్ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.
By: Tupaki Desk | 10 Jun 2025 4:40 PM ISTప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా కోట్ల మందిని తన హావభావాలతో నవ్వించిన ఖాబీ లేమ్ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. మాటలు లేని కామెడీతో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో ట్రెండ్ సృష్టించిన ఈ సెలెబ్రిటీ, ఇప్పుడు అమెరికా ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ కు గురైన ఘటనపై తీవ్ర దుమారం రేగుతోంది.
ఏం జరిగింది?
ఇటలీ పౌరుడైన ఖాబీ లేమ్ (సెరింజ్ ఖబానే లేమ్, వయస్సు 25) ఇటీవలే అమెరికాలోని లాస్ వెగాస్‌కు వచ్చాడు. జూన్ 6న నెవాడాలోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీసా గడువు ముగిసిన తర్వాత అక్కడే ఉన్నట్లు గుర్తించి, US ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.తర్వాత లేమ్‌ను హెండర్‌సన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. కానీ, అదే రోజున వాలంటరీ డిపార్చర్ (స్వచ్ఛందంగా దేశం విడిచిపోవడానికి అనుమతి) ఆదేశం జారీ చేయడంతో అతడిని విడుదల చేశారు. ఈ విషయాన్ని అమెరికా రాజకీయ కార్యకర్త బో లౌడాన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
-వివాదానికి కారణాలు
లౌడాన్ ఆరోపణల ప్రకారం, ఖాబీ లేమ్ వీసా గడువు ముగిసిన తరువాత కూడా అమెరికాలోనే ఉన్నాడు. అంతేకాదు పన్నులు చెల్లించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయట. దీంతో అతన్ని "అక్రమ విదేశీయుడు"గా పేర్కొంటూ డిపోర్ట్ చేయాల్సిందిగా స్వయంగా చర్యలు తీసుకున్నానని లౌడాన్ వెల్లడించారు.
-ఖాబీ లేమ్ ఎవరు?
సెనెగల్‌లో జన్మించిన ఖాబీ లేమ్ ఇటలీలో పెరిగాడు. కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత సోషల్ మీడియాలో తన అదృష్టాన్ని పరీక్షించాడు. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో విడ్డూరమైన పనులు చేసే వీడియోలపై తన హావభావాలతో స్పందిస్తూ కామెడీ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలు చూసి ప్రేక్షకులు వావ్ అనడం ప్రారంభించడంతో అతడి ఫాలోయింగ్ ఆకాశాన్నంటింది. ప్రస్తుతం టిక్‌టాక్‌లో అతడికి 162 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 80 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు ఫోర్బ్స్ 30 అండర్ 30, ఫార్చ్యూన్ 40 అండర్ 40 వంటి ప్రతిష్ఠాత్మక జాబితాల్లో చోటు సంపాదించాడు.
-సమాజ మాధ్యమాల్లో స్పందన
ఖాబీ లేమ్ అరెస్ట్ వార్తపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అతడి అభిమానులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వర్గాలు అతడిని తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తుండగా, మరికొన్ని వర్గాలు వీసా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనంటూ మద్దతు తెలుపుతున్నాయి.
ఖాబీ లేమ్ తరహా సోషల్ మీడియా ఐకాన్‌లు ప్రపంచవ్యాప్తంగా యూత్‌పై ప్రభావం చూపుతారు. అలాంటి సమయంలో వారి చర్యలు, నిబంధనల పట్ల గౌరవం ఉన్నదీ, లేక నిర్లక్ష్యమో అన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. ఈ సంఘటన ఖాబీ వ్యక్తిగతంగా ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూడాల్సివుంది. అయితే ఒక విషయం ఖచ్చితం అతడి హావభావాల వెనుక ఉంది మరొక వాస్తవ ప్రపంచం.