ఇదేం కక్కుర్తి కేజీఎఫ్ బాబు?
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత చందంగా.. కొందరికి అన్ని ఉన్నా ‘కక్కుర్తి’ అనే మహారోగం ఒకటి ఉంటుంది.
By: Tupaki Desk | 24 July 2025 9:38 AM ISTఅంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత చందంగా.. కొందరికి అన్ని ఉన్నా ‘కక్కుర్తి’ అనే మహారోగం ఒకటి ఉంటుంది. వందల కోట్ల రూపాయిల ఆస్తి ఉన్నప్పటికి.. వారు ప్రదర్శించే వెర్రిమొర్రి వేషాలు వారికి అనూహ్య రీతిలో షాకులు ఇస్తుంటాయి. కర్ణాటక రాజకీయాల్లో సంపన్నుడైన వ్యక్తిగా.. అధికారికంగానే తనకున్న సంపద రూ.1700 కోట్లకు పైనే అని చెప్పుకొన్న వ్యక్తి ప్రదర్శించిన కక్కుర్తికి అధికారులు కుక్కకాటుకు చెప్పుదెబ్బ రీతిలో భారీగా ఫైన్ వేసి షాకిచ్చారు.
అవును.. ఇదంతా ఒకప్పుడు స్క్రాప్ వ్యాపారం చేసి.. ఆపై రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కేజీఎఫ్ బాబు అలియాస్ యాసఫ్ షరీఫ్ గురించే. కర్ణాటకలోని కోలార్ మైన్స్ ఆయన స్వస్థలం. కేజీఎఫ్ సినిమా తర్వాత నుంచి ఆయన్ను అందరూ కేజీఎఫ్ బాబుగా పిలవటం షురూ చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన తన గురించి అందరూ మాట్లాడుకునేలా చాలానే చేశారు. 2021లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసి.. తనకున్న వేలాది కోట్ల ఆస్తుల (అధికారికంగా రూ.1700 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు) గురించి అధికారికంగా ప్రకటించి హాట్ టాపిక్ గా మారిన ఈ బాబు.. తనకున్న రోల్స్ రాయిస్ కార్లకు ఎలాంటి పన్నులు కట్టకుండా అక్రమంగా నడుపుతున్న వైనాన్ని రవాణా శాఖ అధికారులు గుర్తించారు.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఆయన రెండు రోల్స్ రాయిస్ కార్లలో ఒకటి బిగ్ బి అమితాబ్ నుంచి రెండోది మరో బాలీవుడ నటుడి నుంచి కొనుగోలు చేశారు. రెండు.. మూడేళ్ల క్రితం వాటిని కొన్నప్పటికీ ఇప్పటివరకు ఆయన తన పేరు మీద బదిలీ చేసుకోలేదు. చెల్లించాల్సిన రోడ్ ట్యాక్స్ కట్టలేదు. దీంతో..మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తోనే బెంగళూరు నగర రోడ్ల మీద దర్జాగా నడిపేస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో అయ్యగారి కక్కుర్తి బయటకు వచ్చింది. ఇద్దరు బాలీవుడ్ ప్రముఖుల నుంచి కొనుగోలు చేసిన ఈ విలాసవంతమైన కార్లను తన పేరు మీద అధికారికంగా బదిలీ చేసుకోలేదు. చెల్లించాల్సిన రోడ్ ట్యాక్స్ ను పే చేయలేదు. దీంతో.. ఈ రెండు కార్లకు కలిపి రూ.38 లక్షలు ఫైన్ వేశారు. ఇదంతా తెలిసిన వారు.. వేలాది కోట్ల ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం? అధికారికంగా చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా ఇదేం కక్కుర్తి? అంటూ నవ్విపోతున్న పరిస్థితి. వేల కోట్ల ఆస్తులుంటే మాత్రం టన్నుల కొద్దీ కక్కుర్తి ఉండకూడదా? అనేలా కేజీఎఫ్ బాబు తీరు ఉందని మాత్రం చెప్పకతప్పదు.
