Begin typing your search above and press return to search.

మౌన ముద్రలో వైసీపీ కీలక మంత్రి...!?

తాజాగా తన జిల్లాకు చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమానికి కూడా గుడివాడ హాజరు కాలేదు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 2:45 AM GMT
మౌన ముద్రలో వైసీపీ కీలక మంత్రి...!?
X

వైసీపీలో కీలక మంత్రి ప్రతీ విషయం మీద చురుకుగా స్పందించే యువ నేత ఇపుడు పూర్తిగా మౌన ముద్ర దాల్చారు. ఆయన ఎవరో కాదు విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్. ఆయన ఎందుకు ఒక్కసారి సైలెంట్ అయ్యారు అన్నది అర్ధం కావడంలేదు అని అంటున్నారు. తాజాగా తన జిల్లాకు చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమానికి కూడా గుడివాడ హాజరు కాలేదు. అదే టైం లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు.

పైగా గొల్ల బాబూరావు మాత్రమే కూడా ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ అభ్యర్ధిగా ఉన్నారు. ఇలా విశాఖ నుంచి ఇద్దరు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమానికి మంత్రి రాలేదు ఎందుకు అన్నది ఇపుడు వైసీపీలో చర్చ సాగుతోంది

దీని కంటే కాస్తా వెనక్కి వెళ్తే జనసేన కీలక నాయకుడు నాగబాబు విశాఖ అనకాపల్లి జిల్లాలలో ఇటీవల పర్యటించారు. ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు. అంతే కాదు మంత్రి సిట్టింగ్ సీటు అయిన అనకాపల్లి వెళ్లి మరీ గుడివాడ మీద హాట్ కామెంట్స్ చేశారు. మామూలుగా అయితే తన సహజ ధోరణిలో గుడివాడ మాటకు మాట అప్పగించేవారు అని అంటున్నారు.

పైగా జనసేన మీద అయితే నల్లేరు మీద బండిలాగా వెళ్తారు అని ఆయనకు పేరు. కానీ ఎక్కడా గుడివాడ నుంచి కామెంట్స్ అయితే లేదు. నో సౌండ్ అన్నట్లుగా మంత్రి ఉన్నారు. దీని మీద అయితే చర్చ సాగుతోంది. మంత్రి గుడివాడ అనకాపల్లి సీటు వదులుకోవడానికి చాలా నెలల క్రితమే సిద్ధం అయ్యారు అని అంటున్నారు. అక్కడ ఆయనకు సర్వేలు వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడంతో ఆయనను పిలిచి పార్టీ పెద్దలు మాట్లాడారు అని అప్పట్లో వార్తల ప్రచారం సాగింది.

అయితే గుడివాడ ఆప్షన్ గా మూడు అసెంబ్లీ సీట్లు పెట్టుకున్నారని వాటిలో ఏదో ఒక దానికి తనకు ఇస్తే పోటీ చేస్తాను అని చెప్పి ఉంచారని అంటున్నారు. అలా చోడవరం, ఎలమంచిలి, పెందుర్తి సీట్లలో ఒకదాన్ని ఆయన కోరుకున్నారు అని అంటున్నారు. చోడవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారు. ఆయనను అధినాయకత్వం పిలిచి మాట్లాడినా ఆయన సీటు త్యాగం చేసేందుకు నో అన్నారని భోగట్టా.

ఇక సర్వేలలో చూసినా గుడివాడ కంటే ధర్మశ్రీకే ఎక్కువ మార్కులు పడ్డాయని అంటున్నారు. దాంతో ఆయనను కదపలేదుట. ఎలమంచిలిలో చూస్తే కన్నబాబు రాజు అనే సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన తనకు కానీ తన కుమారుడికి కానీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అక్కడ చూసినా గుడివాడ కంటే రాజు గారికే ఆదరణ ఉందని సర్వేలు చెప్పాయట. అంతే కాదు ఇక్కడ జనసేన టీడీపీ కాంబోని కొట్టాలీ అంటే కన్నబాబు రాజు సరైన అభ్యర్థి పక్కా లోకల్ అని అంటున్నారు.

పెందుర్తి సీటు విషయంలో కూడా సామాజిక సమీకరణల్తో పాటుగా వైవీ సుబ్బారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ కి అండగా నిలబడ్డారని ప్రచారం సాగుతోంది. దాంతో మూడంటే మూడు సీట్లూ ఆప్షన్లూ పోవడంతో గుడివాడ ఇపుడు దిగాలు పడుతున్నారు అన్న చర్చకు తెర లేస్తోంది. ఆయనకు పార్టీ పదవి ఇవ్వడంతో ఇక పోటీకి దూరంగా పెడుతున్నారు అని అంటున్నారు.

ఈ పరిణామాలు అన్నీ చూసిన మీదటనే గుడివాడ సైలెంట్ అయ్యారని అంటున్నారు. అయితే అనకాపల్లి నుంచి ఎంపీ సీటుకు పోటీ చేయించే ఆలోచన మాత్రం అధినాయకత్వానికి ఉంది అని అంటున్నారు. ఇష్టం లేకపోయినా గుడివాడ ఎంపీ బరిలోకి దిగాల్సిందే అంటున్నారు. అయినా ఆయనకు వేరే ఆప్షన్ లేదని అంటున్నారు