Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో చేరిన కీలక నేతలు... మధు, మోత్కుపల్లికి ఖర్గే కండువా!

గతకొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేస్తూ, కేసీఆర్ పై కామెంట్లు చేసిన మోత్కుపల్లి... తాజాగా మల్లి ఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 7:59 AM GMT
కాంగ్రెస్  లో చేరిన కీలక నేతలు... మధు, మోత్కుపల్లికి ఖర్గే కండువా!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష నడుస్తుంది. అధికార బీఆరెస్స్ కు తెలంగాణలో తాము మాత్రమే ప్రత్యామ్నాయం అని బలంగా చెబుతున్న కాంగ్రెస్... చేతల్లో కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలను ఆకర్షించగలుగుతుంది!

అవును... తెలంగాణలో బీజేపీ, బీఆరెస్స్ పార్టీలలోని అసంతృప్తులకు కాంగ్రెస్ పార్టీ స్వర్గదామంగా మారుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా... కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్... తెలంగాణలో కూడా ఆ జోష్ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గ్యారెంటీ పథకాలు ప్రవేశ పెట్టిన కాంగ్రెస్... ప్రచారాలు కూడా బలంగానే చేస్తుంది.

ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు జైకొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయనతో పాటు మరికొంతమంది కీలక నేతలు ఈ రోజు మల్లిఖార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే సమయంలో... గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలు నిజం చేస్తూ బీఆర్‌ఎస్ మాజీ నేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ గూటికి చేరారు.

ఇలా నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్‌ లో చేరడంతో పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్‌ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. ఒక వైపు కాట శ్రీనివాస్ గౌడ్.. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మద్దతుతో టిక్కెట్ తనకే అంటూ ధీమాగా ఉన్నారని చెబుతుండగా... తాజాగా నీలం మధు కాంగ్రెస్‌ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పటాన్ చెరు టిక్కెట్ హాట్ టాపిక్ గా మారింది!

ఇదే సమయంలో... మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్‌ లో చేరారు. గతకొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేస్తూ, కేసీఆర్ పై కామెంట్లు చేసిన మోత్కుపల్లి... తాజాగా మల్లి ఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈయనతో పాటు మరికొంత మంది నేతలు చేతిలో చెయ్యి వేశారు.

ఇందులో భాగంగా... మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, ఏనుగు రవీందర్ రెడ్డి, శాసన మండలి మాజీ ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కరీంనగర్ బీఅరెస్స్ నేత సంతోష్ కుమార్‌ లు కాంగ్రెస్‌ లో జాయిన్ అయ్యారు. వీరందరికీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో... కాంగ్రెస్ కు మరింత బలం పెరగడంతోపాటు.. రెండో విడత అభ్యర్థుల జాబితాపై తీవ్ర ఆసక్తి నెలకొంది!