Begin typing your search above and press return to search.

పశ్చిమాసియాలో కొత్త టెన్షన్... ఐదో రోజు కీలక పరిణామాలివే!

అవును... రోజు రోజుకీ పశ్చిమాసియా రణరంగంగా మారుతోంది. అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా దాడులు, ప్రతి దాడులతో రెచ్చిపోతున్నాయి.

By:  Tupaki Desk   |   18 Jun 2025 10:04 AM IST
పశ్చిమాసియాలో కొత్త టెన్షన్... ఐదో రోజు కీలక పరిణామాలివే!
X

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఈ సందర్భంగా ఐదో రోజు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే.. అటు ఇజ్రాయెల్ పై ఇరాన్ వ్యూహాత్మకంగా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఐదో రోజైన మంగళవారం జరిగిన దాడుల్లో ఇరు వైపులా భారీ నష్టాలే సంభవించాయి.

అవును... రోజు రోజుకీ పశ్చిమాసియా రణరంగంగా మారుతోంది. అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా దాడులు, ప్రతి దాడులతో రెచ్చిపోతున్నాయి. ఇదే సమయంలో ఇరు దేశాలు పలు నష్టాలను చవి చూస్తున్నాయి. ఈ సందర్భంగా ఐదో రోజైన మంగళవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ట్రంప్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఖమేనీని హతమారిస్తేనే...!:

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని.. అయితే ట్రంప్ ఆ ప్లాన్ ను తిరస్కరించారని.. అలా చేయడం వల్ల ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందన్నారని కథనాలు వెలువడ్డాయనే విషయంపై స్పందించిన ఆయన.. "అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదు, యుద్ధం ముగుస్తుంది" అని పేర్కొన్నారు.

ఖమేనీ సన్నిహిత సలహాదారుడు మృతి!:

ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సీనియర్ మిలటరీ అధికారి అలీ రషీద్ మృతిచెందిన సంగతి తెలిసిందే. అనంతరం అతని స్థానంలో అలీ షాద్మానీని ఇటీవల సాయుధ దళాలకు నూతన నాయకుడిగా అలీ ఖమేనీ నియమించారు. ఈయనను ఖమేనీకి రైట్ హ్యాండ్ అని కూడా అంటారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ దళాలు షాద్మానీని మట్టుబెట్టాయి.

మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి!:

ఇజ్రాయెల్‌ సైనిక చర్యల్లో ఆయువుపట్టైన గూఢచర్య సంస్థ మొస్సాద్‌ కేంద్ర కార్యాలయంపై ఇరాన్‌ దాడికి పాల్పడింది. ఈ సందర్భంగా... మొస్సాద్‌ కేంద్ర కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించినట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. ఇదే సమయంలో.. గ్లిలాట్‌ లోని ఇజ్రాయెల్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ కాంప్లెక్స్‌ పైనా క్షిపణి ప్రయోగించినట్లు తెలిపింది.

ట్రంప్ నుంచి వరుస షాకింగ్ కామెంట్స్!:

కెనడా వేదికగా జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని మధ్యలోనే ముగించి ఆగమేఘాల మీద అమెరికాకు బయలుదేరిన ట్రంప్... మార్గ మధ్యలో సోషల్ మీడియా వేదికగాను, విలేకరులతోనూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. తాను జీ7 సదస్సును వీడి వాషింగ్టన్ వెళ్తున్నది కాల్పుల విరమణ గురించి కాదని.. అంతకంటే 'పెద్దదే' జరగబోతోందని అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఇదే సమయంలో.. ప్రజలంతా టెహ్రాన్ ను ఖాళీ చేయాలని సూచించారు. అనంతరం.. తాను కాల్పుల విరమణ కోసం చూస్తున్నానని చెప్పలేదని.. తాము కాల్పుల విరమణ కంటే మెరుగైన దాని కోసం చూస్తున్నామని.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదానికి "నిజమైన ముగింపు" కోరుతున్నానని విలేకరులతో అన్నారు.

ఈ నేపథ్యంలోనే... సోకాల్డ్ సుప్రీం లీడర్ (ఖమేనీ) ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసని.. అతడిని చంపడం పెద్ద కష్టమేమీ కాదని.. అయితే అది ఇప్పుడు కాదని.. పౌరులపై, లేదా సైనికులపై క్షిపణులు ప్రయోగించాలని తాము కోరుకోవడం లేదని.. ఎటువంటి షరతులు లేకుండా ఇరాన్ లొంగిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెరపైకి 'జీబీయూ-57' భారీ బంకర్ బస్టర్ బాంబ్ చర్చ!:

ఇరాన్ లోని పార్దో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడమే ఇప్పుడు ట్రంప్ ముందున్న ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. అందుకు సరైన ఆయుధం... జీబీయూ-57 అనే భారీ బంకర్ బస్టర్ బాంబ్ అని అంటున్నారు. ఈ అణుకేంద్రం.. ఓ పర్వతం లోపల సొరంగంలో నిర్మించబడి ఉంది. ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయడం సాధారణ బాంబుల వల్ల కాదు.

అందుకే 20 అడుగుల పోడవు, 13,600 కిలోల బరువు ఉండే జేబీయూ-57 అనే భారీ బంకర్ బస్టర్ బాంబును వాడనున్నారనే చర్చ మంగళవారం బలంగా జరిగింది.

'మెరుపు కవచం' బయటకు తీసిన ఇజ్రాయెల్!:

గతంలో హమాస్‌, హెజ్‌ బొల్లా దాడులను సమర్థంగా అడ్డుకున్న ఇజ్రాయెల్‌ ఐరన్ డోమ్‌ ను ఛేదించుకుని మరీ ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్నాయి. టెల్ అవీవ్ లోని పలు కీలక ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ లోని మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైనా ఇరాన్ క్షిపణులు దాడి చేశాయి. దీంతో.. 'మెరుపు కవచాన్ని' బయటకు తీయాలని టెల్ అవీవ్ నిర్ణయించుకుంది.

ఇది ఆ దేశ అత్యాధునిక నేవీ రక్షణ వ్యవస్థ. బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ల దాడుల నుంచి తమ యుద్ధ నౌకలకు రక్షణ కల్పించేందుకు ఈ వ్యవస్థను రూపొందించింది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఛేదించడం ఇరాన్ క్షిపణులకు కష్టంతో కూడుకున్న పని అంటున్నారు.